భర్త కాంగ్రెస్..భార్య బీజేపీ..కారణం అదేనా?

 

ఎన్నికల వేళ నాయకులు పార్టీ మారటం సర్వసాధారణం.కానీ భర్త కాంగ్రెస్ పార్టీ లో ఉంటే భార్య బీజేపీ లో చేరటం ఆశ్చర్యం కలిగించే విషయమే.కాంగ్రెస్ హయాంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారు.హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పద్మినీ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న తరుణంలో ఆయన సతీమణి బీజేపీలో ఎందుకు చేరిందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో పార్టీ మారినట్లు సమాచారం.దామోదర రాజనర్సింహకు ఆంధోల్ టికెట్ కేటాయించడంతో రాజకీయాల్లోకి రావాలి అనుకున్నపద్మినీ రెడ్డికి సంగారెడ్డి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది.సంగారెడ్డి టికెట్ జగ్గారెడ్డి కి కట్టబెట్టడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.సంగారెడ్డి లేదా మెదక్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సానుకూలంగా ఉండటంతో పార్టీలో చేరినట్లు సమాచారం.