అవినీతి ఆరోపణలున్న వ్యక్తికి కీలక పదవి.. ఇదేనా పవన్ విశ్వసనీయత?

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ సలహాదారుడిగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో పి.రామ్మోహన్ రావు తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. సోమవారం ఉదయం పార్టీలో చేరిన ఆయనను పవన్ కళ్యాణ్ వెంటనే తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్మోహన్ రావు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రూపకర్త అని.. ఆయన సూచనలు, సలహాలు జనసేన పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయని తాను ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 

తాను అందరిలాగా రాజకీయాలు చేయడానికి రాలేదని, తన రాజకీయశైలి మిగతా పార్టీలకు భిన్నమని చెప్పుకొస్తున్న పవన్ కళ్యాణ్.. మేధావుల పేరుతో ఇప్పటికే చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారు. దీనిపై పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. అయితే రామ్మోహన్ రావును పార్టీలో చేర్చుకుని.. వెంటనే పదవి ఇచ్చిన విషయంలో మాత్రం పవన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది పవన్ విశ్వసనీయతను ప్రశ్నించాల్సిన విషయమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం.. శేఖర్ రెడ్డి అనే వ్యక్తిపై విమర్శలు చేశారు. ఆయన ఓ పెద్ద దొంగ అని, ఆయనతో మంత్రి నారా లోకేష్‌కు సంబంధాలున్నాయని ఆరోపించారు. శేఖర్ రెడ్డి, లోకేష్ ల దోస్తీ ఆరోపణల్లో నిజమెంత ఉందో తెలీదు కానీ.. శేఖర్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి పరుడు అనే అంశంలో మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ శేఖర్ రెడ్డి వ్యవహారం తమిళనాడులో ఒకప్పుడు కలకలం రేపింది. పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు అసలు నోట్లే దొరకని రోజుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో.. వందల కోట్లు కొత్త నోట్లు పట్టుబడి దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే దీని వెనుక కథేమిటో బయటకు రాలేదు కానీ.. ఆయన పట్టుబడిన తర్వాత ఆ కేసు మొత్తం తాజాగా పవన్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ రావు చుట్టూనే తిరిగింది. అన్నాడీఎంకే నేతలకు అత్యంత దగ్గరయిన శేఖర్ రెడ్డి.. అప్పట్లో సీఎస్‌గా ఉన్న రామ్మోహన్ రావు ద్వారానే పనులు చక్కబెట్టుకున్నారు. వారిద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరిపై ఒకే సారి సీబీఐ దాడులు కూడా చేసింది. సీబీఐ అధికారులు.. రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు ఇంటిపై దాడులు చేసి.. పెద్ద మొత్తంలో ఆస్తులు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. అసలు శేఖర్ రెడ్డి.. రామ్మోహన్ రావుకి బినామీ అనే అనుమానం కూడా సీబీఐ అధికారులు వ్యక్తం చేశారు. బీజేపీతో అన్నాడీఎంకే రాజీపడిపోయింది కాబట్టి.. ఆయన వ్యవహారాలు మరుగునపడిపోయాయి. లేకపోతే సీబీఐ ఇప్పటికీ రామ్మోహన్ రావు ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండేదని తమిళనాడులో చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి వ్యక్తిని పవన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వెంటనే పదవి కూడా కట్టబెట్టారు. శేఖర్ రెడ్డిని పెద్ద దొంగ అన్న పవన్.. అతని తోడు దొంగని పార్టీలోకి తీసుకొచ్చి పదవి కట్టబెట్టారు. ఇదేనా పవన్ చెప్పిన భిన్న రాజకీయ శైలి? ఇదేనా పవన్ విశ్వసనీయత? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.