రఘునందన్ రావు గొంతులో ఆంధ్రావాయిస్

 

తెరాస బహిష్కృత నేత రఘునందన్ సినీ నటుడు కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోస్ భూముల వ్యవహారంలో ఆసంస్థ నుండి హరీష్ రావు రూ.80లక్షలు వసూలు చేసారని చేసిన ఆరోపణలపై స్పందించేందుకు తెరాస నేతలు కొంచెం సమయం తీసుకొన్నపటికీ, యధావిధిగా తమ ఎదురు దాడి వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంబించారు. అందుకు తమకు బాగా అచ్చొచిన ‘ఆంధ్రా అస్త్రాన్ని’ రఘునందన్ రావుపైకి ప్రయోగించి బోడి గుండికి మోకాలికి ముడి పెట్టె ప్రయత్నం చేసారు.

 

తెరాస నేత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, రఘునందన్ రావు గొంతులో ఆంధ్రా పాలకుల, రాజకీయ నాయకుల స్వరం వినిపిస్తోందని, తెలంగాణా ఉద్యమానికి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి ముగ్గురూ కలిసికట్టుగా నడుపుతున్న ఈ కుట్రలో రఘునందన్ రావు పావుగా మారాడని ఆరోపించారు. తెలంగాణా ఉద్యమంలో చీలికలు తెచ్చేందుకు గతంలో ఈవిధంగా చాలా మందే ప్రయత్నించారని, కానీ వారందరూ మట్టిలో కలిసిపోయారని అన్నారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడని, ఇప్పుడు రఘునందన్ రావు ద్వారా కొంత మంది ఆంధ్రా పాలకులు, రాజకీయ నేతలు తెలంగాణా ఉద్యమాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తూన్నారని, వారికుటిల యత్నాలన్నిటినీ ఎదుర్కొని ఉద్యమం నిలబడుతుందని అన్నారు.

 

రఘునందన్ రావు దగ్గర నిజంగా సీడీలు ఉంటే వాటిని వెంటనే బయటపెట్టాలని, లేకుంటే ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. రఘునందన్ రావు ఎటువంటి వాడో తెలుసు కోవాలంటే, ఒకసారి పటాన్ చెరువు (హైదరాబాద్ శివారు ప్రాంతం) ప్రాంత ప్రజలను అడిగితే తెలుస్తుందని ఆయన హేళన చేసారు.

 

ఇక, అతను అవినీతిపరుడని ఈటెల రాజేందర్ అభిప్రాయపడుతున్నపుడు, మరి ఇంత కాలం ఆయనతో భుజం భుజం రాసుకొని ఎందుకు పనిచేసారూ? అవినీతి పరుడని తెలిసిన తరువాత ఆయనని పార్టీలో ఎందుకు కొనసాగించవలసి వచ్చింది? అనే ప్రశ్నలకి ఆయనని నిందిస్తున్న తెరాస నేతలు జవాబు చెప్పవలసి ఉంది.

 

ఇక అదేవిధంగా, తెరాసలో కేవలం తానూ మాత్రమే పరిశుద్ధ ఆత్మ కలవాడినని, మిగిలిన వారందరూ అవినీతి పరులేనన్నట్లు మాట్లాడుతున్న రఘునందన్ రావు, మరి వారు అటువంటి వారని తెలిసి, వారి అవినీతి భాగోతాలను కళ్ళారా చూస్తూ కూడా మరి ఇంత కాలం ఎందుకు ఆ పార్టీలో వారితో కలిసి పనిచేసారు? తెరాస నేతలు అందరి దగ్గర డబ్బు దండుకొంటున్నారని ఆరోపిస్తున్న ఆయన, తనను పార్టీ నుండి అదే కారణంతో బహిష్కరించినందుకు ఆయనేమి జవాబు చెపుతారు? తాటి చెట్టుక్రింద కూర్చొని పాలు తాగుతున్నానని ఎవరు చెప్పినా ప్రజలు అవి పాలని నమ్మరు. గనుక, తన మీద తెరాస చేసిన వసూళ్ళ ఆరోపణలకు ఆయన జవాబు చెప్పుకోక తప్పదు.

 

ఇక, ఆయన తన వద్ద ఉన్న సీడీలు తెరాస నేతలు తీసుకొన్న చెక్కుల కాపీలు వగైరా మీడియా ముందు పెడితే, ఎవరి కధ ఏమిటో ప్రజలే అర్ధం చేసుకొంటారు. తెరాస నేతలు కూడా అవి బయట పెట్టమనే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు గనుక ఆ పనేదో చేసి చూపిస్తే ఎవరు ఎటువంటి వారో ప్రజలకీ అర్ధం అవుతుంది.