యెర్నేని రాజకీయ సన్యాసం స్వీకరించారా?

 

గోళ్ళూడిన సింహాన్ని చూసి జింకలు, కుందేళ్ళు కూడా భయపడవు. పదవీ, అధికారం కోల్పోయిన రాజకీయనాయకుడి పరిస్థితీ ఇంచుమించుగా అదేవిధంగా ఉంటుంది. పార్టీ పట్టించుకోదు, వీధి గుమ్మం దగ్గర తన కోసం పడిగాపులు కాసే అనుచరులు కనబడరు, శిష్యులు గురువులవుతారు, ఓడలు బళ్ళవుతాయి. పూవులమ్మిన చోటే కట్టెలమ్ముకోలేని దుస్థితిలో ఆశ్రయమిచ్చే వేరే పార్టీలకోసం కళ్ళు కాయలు కాస్తాయి. అయినా, చంచల్ గూడా జైలుకు వెళ్ళే (పార్టీ తీర్దం పుచ్చుకొనే) భాగ్యం అందరికీ దక్కదు.

 

మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజారామచందర్ (రాజబాబు) ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉన్నారని చెప్పవచ్చును. మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘కొత్తనీరు వచ్చి పాత నీటిని బయటకు పంపేస్తుందని’ ఎవరిని ఉద్దేశించి అన్నపటికీ, ఆ సూత్రం యెర్నేనికి చక్కగా వర్తిస్తుంది. క్రమంగా తన అనుచరులందరూ వేరే నేతలదగ్గర సర్దుకుపోయి మొహం చూపించడం మానేసిన తరువాత, ఆయన దగ్గర శిష్యరికం చేసిన వారు పైకెదిగి ఆయనను పట్టించుకోక, ఏకులయివచ్చిన స్థానిక నాయకులూ క్రమంగా మేకులయి తన ఓటమికి కారకులయినపుడు, ఇటు రాష్ట్రంలోగానీ, అటు కేంద్రంలోగానీ తన మోర వినే నాధుడు లేకపోవడంతో, వైరాగ్యం కమ్ముకొన్న యెర్నేని గతకొన్ని నెలలుగా రాజకీయాలకు దూరంగా, అజ్ఞాతంలో గడుపుతున్నారు.

 

నిత్యం సంచలన వ్యాఖ్యలతో మీడియాలో కనిపించే ఆయన ఒక్కసారిగా నిశబ్ధం అయిపోయారు. కనీసం ఇటీవల జరిగిన సహకార ఎన్నికలలో సైతం ఆయన జాడ కనిపించకపోవడంతో ఆయన స్వంత పార్టీవారే ఆశ్చర్యపోయారు.

 

ఒకనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడని పేరుగాంచిన యెర్నేని కటాక్ష వీక్షణాలకోసం పడిగాపులు కాసినవాళ్ళే, నేడు ఆయనను పరిహసించే సాహసం చేస్తున్నారంటే ఆయన పరిస్థితి అర్ధం అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్-చార్జ్ గా చక్రం తిప్పిన యెర్నేనిని, ఒకవైపు పిన్నమనేని, మరోవైపు కావూరి వర్గీయులు కలిసి వ్యూహాత్మకంగా ఆయన పరిధిని కుచించివేసి, పార్టీలో జిల్లాలో క్రమంగా ఆయన ప్రాబల్యం తగ్గించడంలో సఫలీకృతం అయ్యారు.

 

ఇందిరమ్మ గృహాల మంజూరుకు ఇన్చార్జిగా ఉన్న యెర్నేనిని ఆ పదవి నుండి తప్పించగలిగారు. ఆ తరువాత కైకలూరు మార్కెటింగ్ యార్డు చైర్మన్ పదవి కేటాయింపులోను ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. కనీసం మండలాల ఇన్చార్జి బాధ్యతలనయినా తన అధీనంలో ఉంచుకొందామనుకొన్న యెర్నేని చేతిలోంచి అదీ లాక్కొని, మాజీ జడ్పీటీసీ సభ్యులకే ఆయా మండలాల బాధ్యతలు అప్పగించడంతో ఆయన హతాశుడయ్యారు.

 

ఇవి చాలవన్నట్లు దొంగ మెడికల్ బిల్లులు పెట్టిన పాపానికి కోర్టు కేసులు తలకు చుట్టుకోన్నాయి. ఆయన తప్పయిపోయింది క్షమించందని ప్రాధేయపడినా కోర్టు కనికరించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయిన యెర్నేని రాజకీయాలు చెడిపోయాయి, నమ్మినవారు మోసంచేస్తున్నారు అంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

 

అయితే, వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించుకొనేందుకు ఆయన ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారని, అటువైపు నుండి సరయిన ఆఫర్ వస్తే, అయన కూడా చంచల్ గూడా జైలు బాట పట్టడం ఖాయం అని పార్టీలో ఆయన వ్యతిరేఖ వర్గం వారు జోస్యం చెపుతున్నారు. ఇక, యెర్నేని జైలుకి వెళ్తారా లేక (రాజకీయ) సన్యాసం స్వీకరిస్తారా అనేది త్వరలో తేలిపోవచ్చును.