ఏకంగా మండలి ఛైర్మన్‌కే వార్నింగా...? సెలెక్ట్ కమిటీపై జగన్ సర్కార్ గేమ్..!

 

ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య సాగుతోన్న పొలిటికల్‌ గేమ్‌లోకి ఇప్పుడు ఉద్యోగులు వచ్చిచేరారు. తన ఆదేశాలను ధిక్కరించిన కౌన్సిల్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులును బాధ్యతల నుంచి తప్పించాలంటూ, గవర్నర్‌కు మండలి ఛైర్మన్‌ ఫిర్యాదు చేసిన తర్వాత తర్వాతి రోజే సచివాలయ ఉద్యోగులు ఎదురుతిరిగారు. మండలి కార్యదర్శికి మద్దతుగా చీఫ్ సెక్రటరీని కలిసిన సచివాలయ ఉద్యోగులు... కౌన్సిల్ ఛైర్మన్ పై భగ్గుమన్నారు. సెలెక్ట్ కమిటీ వివాదంలో మండలి కార్యదర్శి రూల్స్ ప్రకారమే వ్యవహరించారని చెప్పుకొచ్చారు. బాలకృష్ణమాచార్యులుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టిన ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి..... అసెంబ్లీ ఉద్యోగుల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు. అంతేకాదు, నిబంధనల ప్రకారం నడుచుకునే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని తాము కూడా గవర్నర్‌‌ను కోరతామన్నారు.

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ సంచలన నిర్ణయం తీసుకున్న మండలి ఛైర్మన్ షరీఫ్‌.... ఫైల్‌ను కౌన్సిల్ కార్యదర్శికి పంపారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఫైల్‌ను తిప్పిపంపుతూ మండలి సెక్రటరీ కలకలం రేపారు. దాంతో, మరోసారి ఫైల్‌‌ను కౌన్సిల్ కార్యదర్శికి పంపారు ఛైర్మన్‌. అయితే, రెండోసారి కూడా ఫైల్‌ను వెనక్కి పంపడంతో... మండలి కార్యదర్శిపై... కౌన్సిల్ ఛైర్మన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తనకున్న రాజ్యాంగ అధికారాలను ప్రశ్నించడమే కాకుండా, తన ఆదేశాలను ధిక్కరించిన కౌన్సిల్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే, కొత్త కార్యదర్శిగా విజయరాజును నియమించాలంటూ గవర్నర్‌ను కోరారు. దాంతో, సెలెక్ట్ కమిటీ వివాదం సెగ కాస్తా... సచివాలయం ఉద్యోగులను తాకింది. 

నిబంధనలు ప్రకారం నడుచుకున్న కౌన్సిల్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుపై చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదంటూ సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాలు ఏకంగా మండలి ఛైర్మన్ కే అల్టిమేటం ఇచ్చారు. అయితే, దీనంతటి వెనుక జగన్ సర్కారు గేమ్ ఉందనేది టీడీపీ ఆరోపిస్తోంది. సాధారణంగా అధికార పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరించడం సర్వసాధారణమని, కానీ, రాజ్యాంగ పదవిలో ఉన్న  మండలి ఛైర్మన్ కే అల్టిమేటం ఇవ్వడం మాత్రం ఎన్నడూ జరగలేదని అంటున్నారు.