ఈ సిరా ఏ ఓటుదో?

 

 

 

ఎన్నికల్లో దొంగ ఓట్లను నిరోధించేందుకు సిరా చుక్కతో చెక్ పెడతారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఓటరు వేలిపై వేసే ఈ చుక్క వల్ల వాళ్లు అప్పటికే ఓటు వేసినట్టు తెలుస్తుంది. అది పోవాలంటే చాలా సమయం పడుతుంది. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. రోజుల వ్యవధిలోనే ఓటర్లు ఆయా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన వారు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లోను, జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు తరువాత శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు.

 

ఓటు వేసిన వారి ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడతారు. ఈ చుక్క చెరగాలంటే నెలకు పైగా సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఈ రెండు ఎన్నికల మధ్య వ్యవధి తక్కువ కావడంతో ఓటర్లకు పోలింగ్ ఏజెంట్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రెండు ఎన్నికలకూ రెండు వేళ్లకు సిరా చుక్క వేస్తారా? అది సాధ్యం కాదా? అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.