ప్రతి ఒక్కరికీ పరీక్షలే

 

అవును.. ఇది అందరికీ పరీక్షా కాలమే. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు.. రాజకీయ నేతలు.. పార్టీలకు కీలక పరీక్షలు ఒకేసారి వచ్చాయి. తమ భవితకు, ఉన్నత చదువుల మెట్టు ఎక్కేందుకు విద్యార్థులకు పదోతరగతి పరీక్ష.. బిడ్డల జీవితాలపై ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులకూ ఇది అగ్ని పరీక్ష.. పదవుల కుర్చీ ఎక్కేందుకు నేతల జాతకాలకు ఎన్నికల పరీక్ష.. మనుగడ కోసం రాజకీయ పార్టీలకు ఇదే కీలక పరీక్ష.. ఇలా అందరికీ ఒకేసారి పరీక్షా కాలం ముంచుకొచ్చింది.

 

ఈసారి మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు అన్నీ ఒకేసారి రావడం.. అదీ విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడం చిత్రమైన పరిస్థితి. ఎన్నికలు వచ్చాయంటే టీచర్ల పాత్ర అందులో చాలా ఉంటుంది. వారు ఎక్కువగా ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ సరిగ్గా పరీక్షలకు ముందు అలా వెళ్లిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. సీమాంధ్రలో పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమం సాగడంతో దాదాపు వంద రోజులకు పైగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రైవేటు క్లాసులు పెట్టినా సిలబస్ పూర్తికాలేదు. అరకొర చదువులతోనే పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిన దుస్థితి దాపురించింది. దీనికితోడు కరెంటు కోతలు, ఎన్నికల వాతలు విద్యార్థుల ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.