4రోజుల వ్యవధిలో ఎన్నికలు, ఫలితాలు

 

ఈరోజు 10నగర పాలక సంస్థలు, 145 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజే చివరి దశ ఎన్నికలలో భాగంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో 41 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కొద్ది వారాల క్రితం మన రాష్ట్రంలో జరిగిన యం.పీ.టీ.సీ మరియు జెడ్.పీ.టీ.సీ. ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఆ తరువాత శుక్రవారం అంటే మే16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అందువల్ల ఈ నాలుగు రోజులు దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు చాలా కీలకమయినవి. ఈ ఎన్నికలు, వెలువడనున్న ఫలితాలు ఆయా పార్టీల, దేశ భవిష్యత్తుని కూడా నిర్దేశించబోతున్నాయి. మన రాష్ట్రంలో మున్సిపల్ మరియు స్థానిక సంస్థలకు ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది వారాల ముందుగా నిర్వహించినందున, ఈరోజు వెలువడబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజాతీర్పు ఏవిధంగా ఉండబోతోందో చూచాయగా తెలియజెప్పవచ్చును. ఈసారి మున్సిపల్ ఎన్నికలలో ఓటింగు ఈవీయంల ద్వారా నిర్వహించినందున, పూర్తి ఫలితాలు మధ్యాహ్నం నాటికే తెలిసిపోవచ్చును. ముందు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఆ మరునాడే స్థానిక సంస్థల ఫలితాలు, రెండు రోజుల వ్యవధిలో మళ్ళీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడవలసి ఉన్నందున ఓట్లు కౌటింగ్ మరియు ఫలితాలు వెల్లడికి ఎన్నికల కమీషన్ విస్తృతమయిన ఏర్పాట్లు, పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసింది.