కరోనా కేంద్రాలుగా ఎన్నికల ర్యాలీలు 

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత వారం రోజుల్లోనే ఏకంగా తొమ్మిది లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి పలు ప్రాంతాల్లో లాక్ డౌన్లు విధించారు. అయినా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజా మరో షాకింగ్ అంశం వెలుగులోనికి వచ్చింది. ఎన్నికల ప్రచారం కరోనా హాట్ స్పాట్లుగా మారిందని తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా స్థాయిలో పెరుగుతున్నాయి. గత పక్షం రోజుల్లో కేసుల సంఖ్య దాదాపు రెండింతలయ్యింది.ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో  గత 14 రోజుల్లో రోజువారీ కరోనా కేసుల్లో ఏకంగా 300 శాతం వృద్ధి నమోదైంది. కరోనాకు తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌. అక్కడ కేసుల సంఖ్య 378 శాతం పెరిగింది. గత 14 రోజుల్లో 30,230 కొత్త కేసులు నమోదయ్యాయి. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఏప్రిల్‌ 27న తుది విడత పోలింగ్‌ జరగనుంది. అస్సాంలో కొత్త కేసుల సంఖ్య 331 శాతం పెరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో  కేసుల సంఖ్య 175 శాతం పెరిగింది. తమిళనాడులో సైతం కేసుల సంఖ్య 173 శాతం ఎగబాకింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఏపీలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతుండగా.. తిరుపతి ఉన్న చిత్తూరు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో చిత్తూరు జిల్లాలోనే రోజు ఎక్కువ కేసులు వస్తున్నాయి. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీకి బైపోల్ జరుగుతుండగా... ఆ నియోజకవర్గం పరిధిలోనే కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉష్ణోగ్రతలు తనిఖీ చేయడం, శానిటైజర్లు అందించడం వంటి కరోనా నియమాలు పాటిస్తున్నప్పటికీ.. ప్రచారంలో మాత్రం అవేవీ పెద్దగా కనిపించడం లేదు. దీంతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం.. కొవిడ్‌ నిబంధనలు పాటించనట్లైతే.. అభ్యర్థులు, స్టార్‌ క్యాంపెయినర్‌ల ప్రచారంపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది.