మళ్లీ ఎన్నికల నగారా.. టీఆర్ఎస్‌లో టెన్షన్..

తెలంగాణలో మళ్లీ ఓట్ల పండగ. పుర పోరుకు నగారా మోగింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. 22 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు.  ఏప్రిల్ 30న పోలింగ్. మే 3న కౌంటింగ్. 

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి అంచు నుంచి బయటపడిన అధికార పార్టీకి ఈ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. ఇటీవలే రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడంతో టీఆర్ఎస్‌లో ధీమా పెరిగింది. అయితే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బాగా పట్టుంది. వరంగల్, ఖమ్మంలో కాంగ్రెస్ సైతం స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పరిధి 3 జిల్లాలకు విస్తరించడంతో గులాబీ పార్టీ ఏదో విధంగా మేనేజ్ చేసి బయటపడింది. కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఒక్క నగరానికే పరిమితం. గతంలో వరదల ఎఫెక్ట్, ఎల్‌ఆర్‌ఎస్ అంశాలు జీహెచ్ఎమ్సీ ఎన్నికలపై బాగా ప్రభావం చూపించాయి. అవే వరదలు, అదే ఎల్‌ఆర్‌ఎస్.. వరంగల్ వాసులనూ బాగా ఇబ్బంది పెట్టింది. అందుకే, వరంగల్ కార్పొరేషన్‌కు కైవసం చేసుకోవడం అధికార పార్టీకి అంత ఈజీ మాత్రం కాదు. ఆ భయంతోనే రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేసి పెండింగ్ పనులన్నిటీకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేశారు. ఆయన కళ్లల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని విపక్షాలు విమర్శించాయి.

ఇటీవల జరిగిన వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా తీన్మార్ మల్లన్న, కోదండరాం మధ్య చీలిపోయింది. అందుకే టీఆర్ఎస్ గెలిచింది. లేదంటే, ఫలితం మరోలా ఉండేది. అది, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్‌లో బయటపడుతుందని ప్రతిపక్షాలు సవాల్ చేస్తున్నాయి. తమ సత్తా ఏంటో కేసీఆర్‌కు తెలుసొచ్చేలా చేస్తామంటూ తొడగొడుతున్నాయి. 

అటు, ఖమ్మంలోనూ కారు పార్టీకి కష్టాలే. అధికార పార్టీ నేతల మధ్య వర్గ పోరే ఆ పార్టీకి పెద్ద మైనస్. టీఆర్ఎస్‌ను గులాబీ నేతలే పరస్పరం ఓడించుకుంటారని ప్రచారం నడుస్తోంది. అందుకే, ఖమ్మంలో కారు ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగకపోవచ్చు.

మరోవైపు, బీజేపీ చాలా కాలంగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇప్పటికే అనేక సార్లు ఖమ్మం, వరంగల్‌లను చుట్టేసి వచ్చారు. కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేశారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తోంది. టీఆర్ఎస్‌కు జీహెచ్ఎమ్సీ మాదిరే గట్టి షాక్ ఇచ్చేందుకు సై అంటోంది. 

అటు, కాంగ్రెస్ సైతం ఈ రెండు నగరాల్లో బలంగానే కనిపిస్తోంది. హస్తం పార్టీకి వరంగల్, ఖమ్మంలో మంచి కేడర్ ఉంది. కొండా మురళి దంపతులు, నాయిని రాజేందర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి స్వర్ణ లాంటి నేతలు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తారు. అటు, ఖమ్మంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ స్పెషల్ నజర్ పెట్టారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ ఈ ఇరువురు నేతలు ఖమ్మంలో విస్తృత ప్రచారం చేశారు. ఈసారి మరింతగా గెలుపు కోసం కృషి చేస్తారు. ఇలా, బీజేపీ, కాంగ్రెస్ దూకుడుతో అధికార పార్టీకి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కత్తి మీద సవాలే.