తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

 

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్నిరోజులు గల్లీ గల్లీల్లో తిరుగుతూ 'మా పార్టీ గుర్తుకి ఓటేయండి.. మా అభ్యర్థికి గెలిపించండి' అంటూ వినిపించిన మైకులు మూగబోయాయి. నాయకుల ప్రసంగాలకు, హామీలకు తెరపడింది. ఇన్ని రోజులు ఓట్లు కోసం రోడ్డు బాట పట్టి ప్రజలని ఓట్లు అడిగిన నాయకులు.. ఇప్పుడు ఇంటికే పరిమితమై ప్రజలు మాకు ఓటేసి గెలిపిస్తారా లేదా అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. డిసెంబర్ 7 న ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఇన్నిరోజులు అన్నీ పార్టీలు ప్రచారాలతో హోరెత్తించాయి. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ప్రచార సమయం ముగిసింది.

ఈ నెల 7న 119 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. 7న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 1821 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఎన్నికల విధుల కోసం సుమారు 2 లక్షల మంది సిబ్బందిని కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న విడుదలకానున్నాయి. మరి తెలంగాణ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే 11 తేదీ వరకు వేచి చూడాలి.