మేకపాటి వైకాపా నుండి జంపయిపోతారా?

 

 

వైకాపా నెల్లూరు యంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తను పార్టీ వీడుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. కానీ అది మరింత అనుమానం కలిగించేదిగా ఉంది. “ఇప్పుడు పార్టీని వీడవలసిన అవసరం లేదు. అందువల్ల ప్రస్తుతం పార్టీలోనే కొనసాగుతాను. మన దేశంలో ప్రజాస్వామ్యం చాలా బలంగా ఉంది కనుకనే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగారు. దేశ ప్రజలు వంశ పారంపర్య పాలనను వ్యతిరేఖిస్తున్నారనే సంగతి కూడా స్పష్టమయింది. అందువలన పార్టీలలో కూడా అంతర్గతంగా ప్రజాస్వామ్య పద్దతులు పాటించడం చాలా అవసరం. అందుకు మా పార్టీ, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ మినహాయింపు కాదని నేను భావిస్తున్నాను. రాజకీయాలలో ఉన్నవారు అందరూ కూడా నైతిక విలువలు కలిగి ఉండాలి. నేను వైకాపాలో చేరుతున్నప్పుడు నా పాత పదవులన్నీ వదులుకొన్నాను. ఒకవేళ ఎప్పుడయినా వైకాపాను వీడినా పార్టీ ద్వారా పొందిన అన్ని పదవులు వదులుకొంటాను.”

 

“మోడీ, చంద్రబాబు ప్రజలకు మంచి చేస్తే మెచ్చుకొంటాను. అందులో తప్పేమీ లేదు. అదేవిధంగా వారు ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేసినప్పుడు వారితో పోరాడుతాను. వారిని మెచ్చుకొన్నానంటే దానర్ధం నేను ఆ పార్టీలోకి వెళ్లి చేరేందుకు ఆసక్తిగా ఉన్నానని అర్ధం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం వలన ప్రజలకు చాలా మేలు జరుగుతోందని నేను భావిస్తున్నాను. అందుకే ఈసారి జన్మభూమి కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాను,” అని అన్నారు.

 

ఆయన పార్టీని ‘ఇప్పుడు వీడటం లేదు’ అని అనడం గమనిస్తే, ఇప్పుడు కాకపోయినా త్వరలోనే ఎప్పుడో ఒకప్పుడు పార్టీని వీడటం ఖాయమని చెప్పకనే చెపుతున్నట్లుంది. ఇక పార్టీలో ప్రజాస్వామ్యం గురించి, వంశ పారంపర్య పాలన గురించి చెప్పిన మాటలు బహుశః జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నవే అయ్యి ఉండవచ్చును. వైకాపాలో జగన్ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంటారని, సీనియర్ల మాటలకు అసలు విలువీయరని పార్టీని వీడే ప్రతీనేత ఆరోపిస్తుంటారు. ఇప్పుడు మేకపాటి కూడా అదే విషయం ప్రస్తావించడం ఆ ఆరోపణలను దృవీకరిస్తున్నట్లుంది. అంతేకాక జగన్ పద్ధతి పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

 

ఇక రాజకీయ నేతలు సాధారణంగా తమ బద్ద శత్రువులను ఏదో విషయంపై విమర్శిస్తుంటారు తప్ప ఎన్నడూ మెచ్చుకోరు. కేవలం పార్టీ మారబోయే నేతలే తమ ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను నేతలను మెచ్చుకొంటారు. ఇప్పుడు మేకపాటి కూడా అదే చేస్తున్నారు. అందువలన మేకపాటి తను పార్టీ మారుతున్న వార్తలను ఖండించినట్లు కాక బలపరుస్తున్నట్లుంది. ఒకవేళ ఆయన గనుక పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయినట్లయితే, వైకాపాకు పెద్ద దెబ్బే అవుతుంది. అయితే ఆయన తెదేపాలో చేరబోతున్నారా లేక బీజేపీలో చేరుతారా అనేది మాత్రమే ఇంకా తేలవలసి ఉంది.