మనీలాండరింగ్ కేసు.. అహ్మ‌ద్ ప‌టేల్ ఇంటికి ఈడీ అధికారులు

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. స్టెర్లింగ్ బ‌యోటెక్ లిమిటెడ్ సంస్థ‌కు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసులో ఇంటరాగేట్ చేస్తున్న సమయంలో అహ్మద్ పటేల్ పేరు వెలుగు చూసింది. కేసుకు సంబంధించి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఒకరని ఈడీ ప్రశ్నించనప్పుడు అహ్మద్ పటేల్ పేరు వెల్లడించారు. అహ్మద్ పటేల్ తో పాటు ఆయన కుమారుడు ఫైసల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆ సాక్ష్యం ఆధారంగా ఈడీ అధికారులు అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించారు.

వాస్తవానికి జూన్ మొదటి వారంలో విచారణకు హాజరుకావాలంటూ అహ్మద్ పటేల్ కు ఈడీ నటీసులు ఇచ్చింది. అయితే, 65 ఏళ్ల వయోభారంతో పాటు, కరోనా వైరస్ ముప్పు కూడా ఉన్నందున విచారణకు హాజరుకాలేనని పటేల్ చెప్పారు. దీంతో, ఈడీ అధికారులే ఆయన నివాసానికి వెళ్లి ప్రశ్నించారు.

కాగా, ఆంధ్రాబ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి స్టెర్లింగ్ బయోటెక్ రూ. 5 వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ‌వేసింది. ఆ సంస్థ వివిధ ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం మొత్తం రూ. 8,100 కోట్లుగా అంచ‌నా వేస్తున్నారు. మరోవైపు, ఆ సంస్థ యజమానులైన నితిన్, చేతన్ సోదరులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వారు నైజీరియాలో దాక్కున్నారని సమాచారం. దీంతో, వారిని భారత్ కు రప్పించేందుకు ఈడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.