దుద్దిళ్ళ వారి తంటాలు!

 

 

 

మావోయిస్టుల చేతిలో అన్యాయంగా చనిపోయిన తన తండ్రి దుద్దిళ్ళ శ్రీపాదరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం మినహా రాజకీయంగా ఎలాంటి చరిష్మాలేని వ్యక్తి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అని రాజకీయ వర్గాలు భావిస్తాయి. గతంలో రాజకీయాల గురించి ఓనమాలు కూడా తెలియని ఆయన ఎమ్మెల్యే అయ్యారన్నా, మంత్రి అయ్యారన్నా దానికి కారణం ఆయన ప్రతిభ కాదు.. ఆయన తండ్రి మీద ప్రజలకి వున్న సానుభూతే కారణమంటారు. ‘నీ తండ్రికి పట్టిన గతి మరచిపోయావా?’ అని జేఏసీ నాయకుడు కోదండరామ్ బెదిరించడం వల్లనో, నలుగురితోపాటు నారాయణలా వుండాలన్న ఉద్దేశం వల్లనో గానీ శ్రీధర్‌బాబు తాను కూడా తెలంగాణ రాగం ఆలపించారు.

 

తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడు కాబట్టి ఏదో తెలంగాణ పాట పాడుతున్నారులే అని మొన్నటి వరకూ అందరూ అనుకున్నారు. అయితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన శ్రీధర్‌బాబు తెలంగాణ బిల్లు విషయంలో  అతిగా అధికారాలను చేతిలోకి తీసుకోవడంతో మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మంత్రి పదవిని పోగొట్టుకుని తాను చేసిన త్యాగానికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి రూపంలో ప్రతిఫలాన్ని పొందాలని శ్రీధర్‌బాబు ఆశస్తున్నట్టు ఆయన వ్యవహారశైలి చూస్తుంటే అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.



వస్తుందో రాదో తెలియని తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోవాలని ఇప్పటికే పాతికమందికి పైగా తెలంగాణ నాయకులు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ సంగతి అలా వుంచితే, కాంగ్రెస్ పార్టీలోనే ఆ లిస్టు చేంతాడంత పొడవుంది. ఆ లిస్టులో మొదటి స్థానంలో వుండటానికి శ్రీధర్‌బాబు తపన పడుతున్నారు. అవకాశం కల్పించుకుని మరీ ముఖ్యమంత్రి మీద విమర్శలు గుప్పిస్తూ తెలంగాణ హీరోలా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  అయితే ఒకవేళ తెలంగాణ వచ్చినా శ్రీధర్‌బాబుని పక్కకి నెట్టేసే శక్తులు చాలా వున్నాయని, ఆ వాస్తవాన్ని గ్రహించలేక శ్రీధర్‌బాబు అనవసరంగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ సీమాంధ్ర ప్రజల అభిమానాన్ని కోల్పోతున్నారని విశ్లేషిస్తున్నారు.