విమానం హైజాక్ కేసు: కాక్‌పిట్‌ని టాయ్‌లెట్ అనుకున్నాడట

 

ఆస్ట్రేలియా నుంచి బాలి ద్వీపానికి వస్తున్న విమానంలో తప్పతాగిన ఒక ప్యాసింజర్ కాక్‌పిట్‌లోకి దూరడం, పైలట్‌తో ఏదేదో వాగడం, పైలెట్ విమానాన్ని బాలిలో దించి విమానం హైజాక్ అయినట్టు ప్రకటించడం తెలిసిందే. దాంతో బాలీ ఎయిర్‌పోర్ట్ అంతా టెన్షన్‌కి గురైంది. మిలటరీ దిగిపోయింది. విమానం మీద మెరుపుదాడి చేసి హైజాకర్ని బంధించింది. ఆ తర్వాత అతను హైజాకర్ కాదని.. మందు ఎక్కువై ఏదేదో వాగాడని అర్థమైంది. అయినప్పటికీ మిలటరీ వాళ్ళు సదరు ప్రయాణికుడు మాట్ క్రిస్టోఫర్ని బాగా లోతుగా ప్రశ్నించారు. ఈ విచారణలో తేలిందేమిటంటే, పొట్ట పగిలేట్టు తాగిన క్రిస్టోఫర్‌కి అర్జెంటుగా నంబర్ వన్‌కి వెళ్ళాల్సి వచ్చిందట. అటూ ఇటూ చూసిన అతగాడికి ఎదురుగా ఒక తలుపు కనిపించే సరికి దాన్ని తెరిచి లోపలకి వెళ్ళి అక్కడ తన కార్యక్రమం పూర్తి చేయబోయాడట. సడెన్‌గా లోపలికి వచ్చిన క్రిస్టోఫర్ని చూసి పైలెట్లు షాకై క్రిస్టోఫర్ని నానామాటలూ అన్నారట. క్రిస్టోఫర్ కూడా ఏదేదో వాగేశాడట.తాగినమత్తులో తానేం వాగాడో తనకే అర్థం కాలేదట. ఈ గొడవలో తన నంబర్ వన్ ప్రాబ్లాన్ని కూడా మరచిపోయాడట. మిటలరీవాళ్ళు ఎటాక్ చేసి తనని పట్టుకునేవరకూ తనను అందరూ హైజాకర్ అనుకుంటున్న విషయం అర్థం కాలేదట. పాపం ‘నంబర్ వన్’ ఎంతపని చేసింది?