పాక్ ఉగ్రదేశం.. బిల్లును అప్రూవ్ చేయనున్న ట్రంప్..!

 

పాకిస్థాన్ ను ఉగ్ర దేశంగా ప్రకటించాలని చెబుతూ అమెరికా పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఓ ఆన్ లైన్ వెబ్ సైట్లో కూడా పాక్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలని లక్షల సంఖ్యలో సంతకాలు కూడా నమోదైన సంగతి విదితమే. వాస్తవానికి లక్ష సంతకాలు వస్తేనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. అలాంటిది ఒబామా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి త్వరలో అధికారం చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించేలా తయారైన ఓ కాంగ్రెస్ బిల్లును ట్రంప్ అప్రూవ్ చేయనున్నారని ట్రంప్ సలహా సంఘంలోని సభ్యుడు, ప్రముఖ భారత సంతతి వ్యాపారవేత్త శలభ్ కుమార్ వెల్లడించారు. "అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య కచ్ఛితంగా మంచి స్నేహబంధం ఉంటుంది. భారత్ - అమెరికా భాగస్వామ్యం ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కొత్త శిఖరాలకు చేరుతుంది" అని ఆయన అన్నారు.