దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో కొత్త కోణం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పలువురు న్యాయ నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దిశ కేసులో టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పినప్పటికీ... అది ఎంతవరకు నిజమో చెప్పలేమంటున్నారు. ఒకవైపు పోలీసుల తీరుపై దిశ కుటుంబ సభ్యుల ఆరోపణలు... మరోవైపు ప్రజాగ్రహం... ఇంకోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రెజర్ తో ఉక్కిరిబిక్కిరైన సైబరాబాద్ సీపీ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చెప్పినట్లుగానే 24గంటల్లోనే నిందితులను పట్టుకుని రిమాండ్ కి తరలించినా ప్రజాగ్రహం చల్లారకపోవడం.... మరోవైపు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన కావడంతో తెలంగాణ పోలీసులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరగదని, నిందితులకు శిక్షపడదని, ఏదోరకంగా మళ్లీ బయటికొచ్చి మరోసారి ఇలాంటి దారుణాలకు పాల్పడే అవకాశముందని దేశమంతా నినదించింది. అనేక కేసుల్లో అది నిజం కావడంతో పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయాల్సిందేనని, లేదంటే తమకు అప్పగించాలని, తామే శిక్షిస్తామని ప్రజలు డిమాండ్ చేయడంతో... మరో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఎన్ కౌంటర్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

అయితే, న్యాయ నిపుణులు ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఎన్ కౌంటర్ చేయకపోతే నిందితులకు శిక్ష పడటం అనుమానమేనని అభిప్రాయపడుతున్నారు. దిశ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం... అలాగే బలమైన ఆధారాలు లేకపోవడంతో... ఇది కోర్టులో నిలబడటం కష్టమని అంటున్నారు. టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికిందని పోలీసులు చెబుతున్నా... నిందితులే నేరం చేశారనేందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు మాత్రం లేవనే మాట వినిపిస్తోంది. దిశ శరీరం పూర్తిగా కాలి బూడిదగా మారిన నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షతో సరిపోల్చడం కూడా సాధ్యంకాదని... అదే సమయంలో తామే నేరం చేశామని నిందితులు వాంగ్మూలం ఇచ్చినా అది చట్టం ముందు నిలవదని చెబుతున్నారు. చంపుతామని పోలీసులు బెదిరించడంతోనే తాము అలా వాంగ్మూలం ఇచ్చామని నిందితులు చెబితే కేసు వీగిపోయే అవకాశముందని అంటున్నారు.

దిశపై అత్యాచారం జరిగినట్లు రుజువు చేయాలంటే ముందు నిందితులకు వైద్య పరీక్షలు చేయాలి. ఆ సమయంలో వాళ్లు ధరించిన వస్త్రాలు సేకరించాలి. వీర్యం, రక్తపు పరీక్షల కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాల్సి ఉంటుంది. కానీ, ఇవేమీ చేసినట్లు పోలీసులు ప్రకటించలేదు. దాంతో, ఈ కేసు చాలా బలహీనంగా మారిందని, కేవలం నిందితుల వాంగ్మూలంతోనే శిక్ష పడే అవకాశం తక్కువ ఉంటుందని అంటున్నారు. ఇలా, అనేక అడ్డంకుల కారణంగా సరైన ఆధారాలతో కేసును రుజువు చేసి నిందితులకు శిక్షలు పడేలా చేయడం అంత సులభం కాదని... అందుకే, ఎన్ కౌంటర్ చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.