బాబా రామ్‌దేవ్... ఏంటి గురూ ఇది?

 

బాబా రామ్‌దేవ్ తన బాడీని ఎన్ని మెలికలు తిప్పుతూ వుంటాడో, వివాదాలు కూడా ఆయన చుట్టూ అన్ని మెలికలు తిరిగి చుట్టుకుంటూ వుంటాయి. పొట్టని లోపలకి లాక్కుని ఒక్క తిప్పుడు తిప్పే ఈయన ఒక్కోసారి జనాన్ని పొట్ట పగిలేలా నవ్విస్తూ వుంటాడు. ఈయన చేసే యోగా మీద ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. బాబాగారు యోగాసనాలు వేశారంటే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఐదు పదుల వయసుకు దగ్గరపడినా పాతికేళ్ళ కుర్రాడిలాగా ఆయన చెంగుచెంగుమని ఎగురుతూ యోగా చేస్తుంటే నోళ్ళు తెరుచుకుని చూసేవారే తప్ప ఆయనతో సమానంగా చేసేవారు మాత్రం చాలా తక్కువ. యోగా విషయంలో ఆయన సూపర్. అయితే ఆయన అప్పుడు చేసే కామెంట్లే వెరైటీగా వుంటాయి. ఆయన తన ఫార్మా కంపెనీలో ఉత్పత్తి చేసే ఆయుర్వేద మందులకు మార్కెటింగ్ చేసుకునే పద్ధతే వివాదాస్పదం అవుతూ వుంటుంది. ఈ మధ్య రామ్‌దేవ్ బాబా తన కంపెనీలో తయారు చేసే ఒక మందు గురించి తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఆయనతోపాటు ఆయన శిష్య గణం కూడా ఈ మందుని బాగా ఊదరగొడుతున్నారు. రామ్ దేవ్ బాబా ప్రచారం చేస్తున్న ఆ మందు పేరు ‘దివ్య పుత్ర జీవక్ బీజ్’. ఈ మందు వాడిన వారికి మగబిడ్డలు ఖాయంగా పుడతారట. జీవితంలో ఇక పిల్లలు పుట్టరని డిసైడ్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ మందు ఉపయోగించారంటే వాళ్ళకి పిల్లలు పుట్టడమే కాదు... ఏకంగా మగపిల్లలే పుడతారట. మగపిల్లలు మాత్రమే కావాలని అనుకునేవారు ఈ మందు పుచ్చుకుంటే చాలు.. గుమ్మడిపండు లాంటి మగపిల్లాడు పుట్టడం ఖాయమట. ఈ ప్రచారం విన్న జనం వేలంవెర్రిగా సదరు మందు కొని ఉపయోగించేస్తున్నారు. అయితే ఈ అంశం మీద వివాదాలు కూడా బాగానే వున్నాయి. ఓ చిన్న ప్యాకెట్లో వున్న రామ్ దేవ్ బాబా మందు తింటేనే పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే పనయితే ఇక ఫర్టిలిటీ సెంటర్లు గట్రాల అవసరం ఏంటని చాలామంది వెటకారంగా ప్రశ్నిస్తున్నారు. అసలే సమాజంలో ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోయింది. భ్రూణహత్యలు పెరిగిపోయాయి. ఒకవేళ రామ్‌దేవ్ బాబా మందు నిజంగా పనిచేసే మందే అయితే... ఇక దేశంలో ఆడపిల్లల జాడైనా కనిపిస్తుందా? ఆ మందేదో కనిపెట్టేముందు రామ్‌దేవ్ బాబా ఈ విషయాన్ని కూడా ఆలోచిస్తే బాగుండేదని అంటున్నారు.