ఏపీలో ఉల్లి లొల్లి... అసెంబ్లీలో బాబు వర్సెస్ జగన్

ఏపీలో ఉల్లి లొల్లి కంటిన్యూ అవుతోంది. దిశ ఉదంతం నేపథ్యంలో మొదటిరోజే మహిళల భద్రత కోసం విప్లవాత్మక చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను చేపడితే... ప్రతిపక్ష టీడీపీ మాత్రం ...ముందుగా ఉల్లిపై డిస్కషన్ చేయాలంటూ పట్టుబట్టింది. అందుకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో... తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. ఉల్లిపై చర్చ చేపట్టాల్సిందేనంటూ స్లోగన్స్ తో హోరెత్తించారు. దాంతో, టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే మహిళల భద్రతపై చర్చ కొనసాగించింది. అయితే, ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసి తనపై బురద చల్లడానికే ఎక్కువ సమయం కేటాయిస్తోందని, సీఎం జగన్ కు కూడా అదే ఆనందంగా ఉందని చంద్రబాబు సెటైర్లు వేశారు. 

ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి వాగ్భాణాలు సంధించారు. జగన్ చేసే మేలు ఉల్లి కూడా చేయదేమో కాబోలు... అందుకే ఉల్లి అవసరం లేదని రేటు పెంచారంటూ ఎద్దేవా చేశారు. రైతుబజార్లలో ప్రజలు బారులు తీరిన ఫొటోను ట్వీట్ చేసిన పవన్... ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమంటూ మండిపడ్డారు. అయితే, విపక్షాల ఆరోపణలను సీఎం జగన్ తిప్పికొడుతున్నారు. మార్కెట్లో రెండు వందల రూపాయలున్న కిలో ఉల్లిని... తమ ప్రభుత్వం కేవలం 25 రూపాయలకే అందిస్తోందని తెలిపారు. అయినా, చంద్రబాబు తన హెరిటేజ్ సూపర్ మార్కెట్స్ కిలో ఉల్లిని ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. హెరిటేజ్ లో కిలో ఉల్లిని రెండొందలకు అమ్ముతుంటే... తాము ఇరవై ఐదు రూపాయలకే అందిస్తున్నామని... ఇంతకంటే ఇంకేం చేయాలని జగన్ ప్రశ్నించారు.