తమిళనాడులో మరో కొత్త పార్టీ

తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మక్కల్ నీది మైకం పార్టీ ని స్థాపించిన కమల్ హాసన్, పార్టీ ని దృఢపరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రాజకీయ అరంగ్రేటం విషయంలో ఇది వరకే అధికారిక ప్రకటన చేసాడు. అయితే, పార్టీ పేరు ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరో స్టార్ హీరో విజయ్ కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దమవుతుంది. అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ కొత్త పార్టీ లాంఛ్‌ తేదీని ప్రకటించాడు. ఈ నెల 15వ తేదీన కొత్త పార్టీ ప్రకటనతోపాటు పార్టీ గుర్తును కూడా ప్రకటించబోతున్నారు. మధురైలో బహిరంగ సభ ఏర్పాటు ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను దినకరన్‌ వెల్లడించనున్నారు. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో దినకరన్‌ స్వతంత్ర్యగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఓవైపు పార్టీలో సభ్యత్వం, మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోయిన నేపథ్యంలోనే దినకరన్‌ కొత్త పార్టీ ఆలోచన చేశారు.