డిగ్గీకి విభజన వర్తించదా?

 

 

 

ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లు-2014 ను ఉభయ సభలు ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోదముద్ర పడడం అయిపోయింది. వాటాలు, కోటాలు, పంపకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ల అపాయింటెడ్ తేదీ కూడా జూన్ 2 గా నిర్ణయించేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, విపక్షాలతో కుమ్మక్కు అవ్వాల్సి వచ్చినా రాజీ పడని కాంగ్రెస్.. ఇచ్చిన మాటకు కట్టుబడి విభజన చేసేసింది. తమ పార్టీకి కూడా రెండు కార్యవర్గాలను ప్రకటించేసింది.

 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పొన్నాల, అవశేష ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డితో ఇరుప్రాంతాలకు ఎన్నికల, పార్టీ కార్యవర్గాలను కూడా నియమించింది. పట్టు పట్టి రాష్ట్రాన్ని విడగొట్టిన డిగ్గీ రాజా మాత్రం రెండు రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా పనులు చక్కబెట్టేస్తున్నాడు. తెలంగాణలో హామీలు సీమాంధ్ర కు పనికి రావు. సీమాంధ్ర కంటి తుడుపు ప్యాకేజీ మాటలకు  తెలంగాణాలో ఓట్లు రాలవు. రెండు రాష్ట్రాలకు ఇద్దరు ఇంచార్జ్ లను నియమిస్తే బాగుంటుందని సీమాంధ్ర  కాంగ్రెస్ లో మిగిలిన నాయకులు తమ ఆంతరంగిక చర్చల్లో ప్రస్తావిస్తున్నారు.



ఇప్పటికే ఇరు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి జైరాం రమేష్  చేసిన వ్యాఖ్యలు పార్టీకి పూడ్చలేని నష్టాన్ని చేశాయని వాపోతున్నారు. ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేశారు, ఒక పీసీసీని రెండుగా విభజించేశారు. మరి ఇంచార్జ్ గా ఒక్క డిగ్గీ రాజానే ఎందుకు కొనసాగిస్తున్నారో అర్ధం కావడం లేదని, తమ చేతలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరు ప్రాంతాల నేతల్ని ఇరుకున పెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనియమ్మా విభజన మాకే కాదు.. డిగ్గీరాజా లాంటి ఇంచార్జ్ లకు కూడా వర్తింపజేయమ్మ అని వేడుకుంటున్నారు.