రాష్ట్ర విభజనపై స్పష్టత ఇస్తాం: దిగ్విజయ్

 

తెలంగాణ అంశంపై రేపు కీలక నిర్ణయం వెలువడనుందని అందరూ భావిస్తున్నతరుణంలో నిన్న హోంమంత్రి షిండే ‘అది ఇప్పటికిప్పుడు తేల్చగలిగే విషయం కాదని’ అన్నారు. ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఇక ఈ అంశాన్ని వాయిదా వేయడం ఎంత మాత్రం కుదరదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా? లేక విభజించాలా? అనే రెండు ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి అమలు చేయక తప్పదని’ అన్నారు. తాము రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఒక నిర్ణయం తీసుకొంటామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని, అలాగే యుపీయే భాగస్వామ్య పక్షాలతో కూడా ఈవిషయంపై చర్చించి వారి అభిప్రాయం కూడా తీసుకోవలసి ఉంటుందని అన్నారు. ఏమయినప్పటికీ రాష్ట్ర విభజనపై ఇక ఎంత మాత్రం నాన్చకుండా స్పష్టత ఈయబోతున్నామని ఆయన తెలియజేసారు.