తెరాసపై ఇంకా ఆశ చావని కాంగ్రెస్

 

తెరాస అధ్యక్షుడు కేసీఆర్ హస్తం పార్టీలో గులాబీ ముళ్ళు గుచ్చి మరీ తెగతెంపులు చేసుకొంతున్నట్లు ప్రకటించినా, ఇంకా కాంగ్రెస్ పార్టీకి తెరాసపై ఆశ చావలేదని దిగ్విజయ్ సింగ్ తాజా ప్రకటన స్పష్టం చేస్తోంది. “తెరాసను మా పార్టీలో విలీనం చేయడం, చేయకపోవడం వారిష్టం. తెరాస ఎన్నికల పొత్తులకు ప్రత్యేకంగా కమిటీ వేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. తెరాస పొత్తులకు సిద్దమన్నట్లు సూచింది గనుక, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు-సీట్లు సర్దుబాట్ల కోసం మేము ప్రతేకంగా ఒక కమిటీ వేస్తున్నాము,” అని అన్నారు.

 

ఒకవైపు టీ-కాంగ్రెస్ నేతలందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్సిస్తూ తెలంగాణాలో అన్ని సీట్లు తామే గెలిచేసుకొంటామని గొప్పలు చెప్పుకొంటుంటే, దిగ్విజయ్ సింగ్, ప్రస్తుతం తెలంగాణాలో పర్యటిస్తున్న జైరాం రమేష్ ఇద్దరూ కూడా తెరాస తమతో కనీసం పొత్తులకయినా అంగీకరించకపోదా? అనే ఆశతో మాట్లాడటం ఆ పార్టీ దైన్య స్థితికి అద్దం పడుతోంది. 125సం.ల ఘన చరిత్ర గల ఒక జాతీయపార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీతో పొత్తులకు ప్రాకులాడుతున్న తీరు చూస్తే ఎవరికయినా జాలి కలుగకపోదు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ, తెరాస కనికరిస్తే తప్ప గెలవలేమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు వారి ప్రాకులాట చూస్తే అర్ధమవుతుంది.

 

తెరాస విలీనానికి అంగీకరించదని తెగేసి చెప్పినా కూడా అందుకే దిగ్విజయ్ సింగ్ ఇంకా చాలా సౌమ్యంగానే మాట్లాడుతున్నారు. ఒకవేళ తెరాస పొత్తులు కూడా ఉండవని మరోమారు కుండ బ్రద్దలు కొడితే, అప్పుడు దిగ్విజయ్ సింగ్ నరేంద్ర మోడీని, బీజేపీని ఏవిధంగా తిట్టి పోస్తున్నాడో అదేవిధంగా కేసీఆర్ మరియు తెరాసలపై విరుచుకు పడటం ఖాయం. కానీ, ఎన్నికల తరువాతయినా తమ యూపీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయనకు ఏ మాత్రమయినా నమ్మకం ఉన్నట్లయితే, తెరాస మద్దతు కోసం నోరుని అదుపు చేసుకొంటూ కాలక్షేపం చేయవచ్చును. ఒకవేళ ఆయన తెరాస మీద నోరు పారేసుకొంటే దానర్ధం...ఇక కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం, యువరాజ పట్టాభిషేకం వగైరాల మీద పూర్తిగా హోప్స్ వదిలేసుకోన్నట్లే భావించవచ్చును. బహుశః కాంగ్రెస్ ఇంత దీన స్థితికి ఎన్నడూ దిగాజారలేదేమో..పాపం కాంగ్రెస్!