కిల్లి కృపారాణిపై ధర్మాస్త్రం

 

 

కాంగ్రెస్ నేతలకి బయట పార్టీలతో ఎంత బెడద ఉంటుందో, లోపల కూడా అంతే మంది శత్రువులతో నిత్యం యుద్ధం చేయవలసి ఉంటుంది. లేకుంటే ఆ పార్టీలో ఎవరూ నిలబడలేరు. బహుశః అందుకే వారు ఎన్నడూ కూడా చక్కగా వారి విధులను నిర్వర్తించగా, పరిపాలన చేయగా చూసేందుకు ప్రజలు నోచుకోవడం లేదు. ఇక విషయంలోకి వస్తే, శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు సీబీఐ మరక పడనంత వరకు ఎదురులేని నాయకుడిగా చక్రం తిప్పేవారు. ఆ జిల్లాలో ఆయనకు గట్టి పోటీనిచ్చిన తేదేపా నాయకుడు ఎర్రంనాయుడు కూడా మరణించడంతో, ఇక ధర్మానకి ఎదురే లేకుండా పోయింది.

 

అయితే, సీబీఐ లిస్టులో ఆయన పేరు ఎక్కినప్పటి నుండీ ఆయనకి చెడ్డ రోజులు మొదలయ్యాయి. ఆ తరువాత బలవంతంగా పదవిలోంచి దిగవలసి రావడం, నిన్న మొన్నటి వరకు అరెస్టు గండం అన్నీకలిసి జిల్లా రాజకీయాలలో ఆయన ప్రాభవానికి బీటలు తెచ్చాయి. దానికి తోడూ ఆయన కుటుంబ సభ్యుడు గిరిజనులకు చెందిన కన్నెధార అనే కొండ ప్రాంతాన్ని స్వాదీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఆయనకు జిల్లాలో చాల చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి.

 

ఈ సంధి కాలంలో కిల్లి క్రిపారాణీ చాలా చాకచక్యంగా స్థానిక కాంగ్రెస్ నేతలను తనవైపు తిప్పుకొని కొంచెం గుర్తింపు పొంది, ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు.

 

ఇప్పుడు ధర్మాన సీబీఐ అరెస్ట్ గండం తప్పించుకోవడంతో కొంచెం తేరుకొని జిల్లా రాజకీయాల మీద మళ్ళీ పట్టు సాధించేందుకు పావులు కదపడం మొదలుపెట్టారు. ఇంత కాలం సమైక్యాంధ్ర ఉద్యమ కారులు ఆయన రాజీనామా కోసం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ లొంగని ఆయన మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేఖిస్తూ మాట్లాడగానే, వెంటనే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన  అనుచరులయిన స్థానిక ఎమ్మెల్యేలు జగన్నాధం, భారతి, సత్యవతిలు కూడా రాజీనామా చేయనున్నారు. ముఖ్యమంత్రి విభజనపై చెప్పిన మాటలను తాను పూర్తిగా సమర్దిస్తున్నామని, రాష్ట్రం విడిపోతే అన్నీ సమస్యలేనని, అందుకే రాష్ట్ర సమైక్యత కోసం రాజీనామాలు చేస్తున్నటు దర్మాన ప్రకటించారు.

 

దీనితో ఇంత వరకు రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నతన ప్రత్యర్ధి కిల్లి క్రుపా రాణీపై ఒత్తిడి పెరిగేలా చేయగలిగారు. ధర్మాన తన రాజీనామాతో కేవలం శాసన సభ్యత్వం మాత్రమే వదులుకోగా, కృపా రాణీ మాత్రం అతికష్టం మీద సంపాదించుకొన్న కేంద్ర మంత్రి పదవిని వదులుకోక తప్పనిసరి పరిస్థితి కల్పించారు.

 

ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు పదవుల మీద కాంక్ష లేదని, కేవలం ప్రజల ఆందోళనలు కేంద్రానికి తెలియజేయడానికే పదవిలో కొనసాగుతున్నాని, తన రాజీనామా పత్రం బ్యాగులో పెట్టుకొనే తిరుగుతున్నానని, ఎప్పుడు అవసరమనుకొంటే అప్పుడు తక్షణం తప్పుకొంటానని చెప్పడం, ధర్మాన వర్గం ప్రయోగించిన రాజీనామాస్త్రాల మహిమేనని చెప్పక తప్పదు.

 

ఇప్పుడు ధర్మాన చేయవలసిందల్లా సమైక్యవాదులను ఆమె ఇంటివైపు మళ్లించడమే. ఆమె రాజీనామా చేసినట్లయితే జిల్లా రాజకీయాలలో మళ్ళీ సమతూకం ఏర్పడి, ధర్మాన పై చేయి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.