వెనకేసుకు వచ్చిన ముఖ్యమంత్రిదే తప్పట

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంత కాలం సీబీఐను, ప్రతిపక్షాలను, చివరికి స్వపక్ష నేతలను కూడా కాదని కళంకిత మంత్రుగా ముద్రపడ్డ ధర్మాన ప్రసాద రావు, సబిత ఇంద్రా రెడ్డి తదితరులను కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాపడుకోన్నట్లు కాపాడుకొచ్చారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడివల్ల సబితా ఇంద్రా రెడ్డిని, ధర్మాన ప్రసాదరావును నిన్న తమ పదవుల లోంచి తప్పించవలసి వచ్చింది. ఆయన అదే విషయం వారికీ వివరించి చెప్పారు. కానీ వారిరువురూ మాత్రం ఇప్పుడు ఆయననే తప్పు పడుతున్నారు.

 

తాము రాజీనామాలు సమర్పించి చాలా కాలం అయినప్పటికీ, వాటిని ముఖ్యమంత్రి ఆమోదించకుండా ఇంత కాలం నానబెట్టి, చివరకు తమను ఈవిధంగా అవమానకరంగా పదవుల నుండి తప్పించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆనాడే తమ రాజీనామాలను ఆమోదించి ఉండి ఉంటె నేడు తమకీ దుస్థితి వచ్చేది కాదని వారిరువురూ వాపోతున్నారు. ఇంత కాలం పార్టీకి సేవలు చేసినందుకు చివరికి తమకు పార్టీ ఇచ్చిన బహుమతి ఇదని వారిరువురూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే, తమకు ఈ అవమానకర పరిస్థితులు కల్పించారని ముఖ్యమంత్రిని నిందిస్తున్నవారిద్దరూ, తమకి ఆ పదవులు వద్దని నిజంగా మనస్పూర్తిగా కోరుకొన్నట్లయితే, వారు మళ్ళీ తమ విధులకు యధావిధిగా హాజరు కాకుండా, ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి తమ పదవుల నుండి తప్పుకొని ఉండేవారు. కానీ, వారిరువురూ ఏదో కొన్ని రోజులు మొక్కుబడిగా విధులకు దూరంగా ఉండి, మళ్ళీ యధావిధిగా విధులకు హాజరవడం వారికి తమ పదవులలో కొనసాగాలనే కోరిక బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ఇప్పుడు ఆ విషయం ఒప్పుకోకుండా వారిరువురూ ముఖ్యమంత్రిని నిందించడం చాలా తప్పు.ఇది స్వయంకృతాపరాధం మాత్రమే. దీనిని గునపాటంగా భావించి ఇకనయినా మిగిలన కళంకిత మంత్రులు, తమకి ఇటువంటి పరిస్థితి ఎదురుకాకూడదని భావిస్తే వెంటనే వారు  తమ పదవులకు రాజీనామా చేయడం మంచిది.