ఏపీకి రావాలంటే పర్మిషన్ కావాల్సిందే.. డీజీపీ

కేంద్రం అన్ లాక్ 2 మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఆ రాష్ట్రాల నుండి ఎంటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ లో కొన్ని రోజులలో నిర్వహించవలసిన ప్రవేశ పర్రేక్షలను వాయిదా వేయడం తో పాటు, ఇటు హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్ననేపథ్యంలో నగర వాసులు ఏపీలోని తమ స్వంత ఊళ్లకు క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్, విజయవాడ హైవేపై ఉన్న టోల్ ప్లాజాలతో పాటు ఏపీ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇదే సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న వారంతా నిబంధనలు పాటించాల్సిందే అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని ఈ సందర్బంగా అయన తెలిపారు. దీని కోసం స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని అన్నారు. అలా అనుమతి తీసుకున్న వారిని ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని డీజీపీ తెలిపారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి ప్రజలను అనుమతిస్తామని అన్నారు. ఐతే అనుమతి తీసుకున్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదని వివరించారు. రాత్రి సమయం లో కేవలం అత్యవసర, నిత్యావసర సర్వీసులకు మాత్రం అనుమతి కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు.