డెంగీ, చికెన్‌గున్యాలను తరిమికొడదాం!

 

డెంగీ- ఒకప్పుడు దీని అర్థం ఎవరికీ తెలియదు. ఇప్పుడో! ఈ పేరు వినని వారు ఉండరు. ఓ నాలుగు చినుకుల వర్షం కురిస్తే ఈ మహమ్మారి ఎక్కడ బయటకి వస్తుందో అని అనుమానం! ఓ రెండు డిగ్రీల జ్వరం పెరిగితే అది డెంగీ ఏమో అన్న భయం! వెరిసి డెంగీ ఇప్పుడు ఇంటింటి పేరు. ఇంతకీ ఈ డెంగీ ఏమిటి? దాన్నుంచి తప్పుకునే మార్గమే లేదా అంటే లేకేం....

 

డెంగీ వ్యాధి ఏడిస్‌ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. మిగతా దోమలకంటే ఈ ఏడిస్‌ దోమ తీరు చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనం దీని బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఈ దోమ మన ఇంట్లో నిలువ ఉండే మంచినీటిలో సులభంగా బతికేస్తుంది. పాత టైర్లు, కుండీలు, కూలర్లు, ఫ్లవర్‌వాజులు, ఈతకొలను, నీటిడ్రమ్ములు... ఇలా ఎక్కడ మంచినీరు కాస్త నిలువ ఉంటే, అక్కడ వందలకొద్దీ గుడ్లను పొదిగేస్తుంది. పైగా ఇది పగటివేళల్లోనే కుడుతుంది. మన ఇళ్లలోని కర్టెన్ల వెనకాల, మంచాల కింద, బీరువాల చాటునా బతికేస్తూ అదను చూసి మన మీద దాడి చేస్తుంది. ఈ వైరస్‌ ఉన్న దోమ కుట్టినప్పటి నుంచి వారం రోజుల లోపు డెంగీ సూచనలు కనిపిస్తాయి. జ్వరంతో పాటుగా తలనొప్పి, కళ్ల వెనుక పోట్లు, కీళ్లు కండరాల నొప్పులు, దద్దుర్ల వంటి లక్షణాలు ఉండవచ్చు. అరుదుగా చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తం కారడాన్ని కూడా గమనించవచ్చు.

 

మన శరీరంలోని రక్తస్రావాన్ని అరికట్టే ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, రక్తం పలచబడటం వంటి సూచనల ద్వారా రోగికి డెంగీ సోకిందని నిర్ధారిస్తారు. డెంగీ సోకిన వ్యక్తి ఒకటి రెండు వారాలలో తిరిగి కోలుకుంటాడు. అప్పటివరకూ తగినంత విశ్రాంతిగా ఉండటం, పోషకాహారాన్ని తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇక డెంగీతో మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి... నీరు, పండ్లరసాలు, ORS వంటి ద్రవపదార్థాలను తీసుకుంటూ ఉండాలి.

 

డెంగీ ప్రాణాంతకం కాదు. అలాగని వైద్యుని సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు మాత్రలు వేసుకుంటే మాత్రం పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. ఇక కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, కళ్లు తిరగడం, ఆయాసం, శరీరం మీద ఎర్రటి దద్దుర్లు, రక్తస్రావం... వంటి లక్షణాలు కనిపించినప్పుడు తక్షణమే వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది. సకాలంలో అందే వైద్యంతో డెంగీ రోగలక్షణాలు తగ్గడమే కాకుండా, ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. డెంగీ వచ్చాక తీసుకోవల్సిన జాగ్రత్తల కంటే అది రాకుండా చూసుకోవల్సిన అవసరమే ఎక్కువ. ఇందుకోసం...

 

- ఇంట్లోనూ, ఇంటి ఆవరణలోనూ ఎక్కడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.

- తేమ లేదా చీకటిగా ఉండి దోమలు వృద్ధి చెందే పరిస్థితులు ఉన్నచోట బజార్లో దొరికే దోమల మందుని చల్లాలి.

- ఉదయం వేళ్లలో కూడా మస్కిటో రిపెల్లంట్స్‌ని వాడుతూ ఉండాలి.

- రోజంతా పడుకుని ఉండే పసిపిల్లలకి ఉదయం వేళల్లో కూడా దోమతెరని కట్టాలి.

- శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.

 

చికెన్‌గున్యా

డెంగీలాగానే చికెన్‌గున్యా కూడా ఏడిస్‌ దోమ ద్వారానే వస్తుంది. అయితే జ్వరంతో పాటుగా తీవ్రమైన తలనొప్పి, కీళ్లనొప్పులను ఈ వ్యాధిలో గమనించవచ్చు. వ్యాధి తగ్గిన తరువాత కూడా వారాలు, నెలల తరబడి కీళ్లనొప్పులతో రోగి బాధపడటం చికెన్‌గున్యాలో సాధారణం. అందుకే చికెన్‌గున్యా వచ్చిన రోగులు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటుగా కీళ్లనొప్పులకు మందులను కూడా వాడవలసి ఉంటుంది. డెంగీ దోమలు వ్యాపించకుండా, అవి కుట్టకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, అవన్నీ చికెన్‌గున్యాకు కూడా వర్తిస్తాయి.

 

డెంగీ, చికెన్‌గున్యాలు రెండూ ప్రాణాంతకం కాకపోయినా, రోగిని నిస్సహాయంగా మంచాన పడవేసే వ్యాధులు. వీటి బారిన పడినవారు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి అవి వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకుందాం. వాటిని మన జీవితాల్లోంచి తరిమికొడదాం! 

 

..Nirjara