"హైదరాబాద్'' ప్రత్యేక రాష్ట్ర నినాదం వెనక రహస్యం!

-డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

 

"ఆలూ, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం'' అని ముందుగానే పెళ్ళిగాని ఓ ఉత్సాహవంతుడు పేరు పెట్టుకున్నాడట! అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్య ఒక కొలిక్కి రాలేదు, వచ్చే లక్షణాలు కూడా కనిపించడం లేదు. దానికితోడు జైపూర్ సమావేశాల్లో కాంగ్రెస్ అధిష్టానవర్గం చర్చలలో కూడా తెలంగాణా సమస్యే ఒక ప్రధానాంశంగా ప్రస్తావనకు సహితం రాలేదని పత్రికలూ వార్తలు మోసుకొచ్చాయి. ఈ సందర్భంలోనే రాష్ట్ర మంత్రివర్గంలో హైదరాబాద్ మంత్రులయిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ఒక సంచలన ప్రకటనతో ముందుకొచ్చారు.


" ఆంధ్రప్రదేశ్ ను విభజించే పక్షంలో హైదరాబాద్ నగరాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి'' అని ప్రకటించారు [16-01-2013]! ఒక రకంగా వారు తమ వాదనకు చెప్పిన కారణం కూడా చూడ్డానికి సబబుగానే ఉన్నట్టుతోస్తుంది. రాష్ట్రానికి రాజధానిగా గత 56 ఏళ్ళనుంచి ఉన్న మహానగరాన్ని ఇలా "ప్రత్యేక రాష్ట్రం''గా గుర్తించాలన్న ఈ మంత్రుల కోర్క వెనక ఓ వాస్తవం దాగి ఉంది.



తెలంగాణాలోని వేర్పాటువాదులుగా మారిన కొందరు రాజకీయ నిరుద్యోగులు - "తెలుగువారైన ఆంధ్రులంతా తెలంగాణా నుంచి హైదరాబాద్ నుంచీ వెళ్ళిపోవాలి, హైదరాబాద్ మాది, సీమాంధ్రుల శ్రమతోనూ, పెట్టుబడులతో నిర్మించింది కాదు, తెలంగాణా ప్రజల కష్టార్జితం హైదరాబాద్'' అంటూ ఇటీవల కొంతకాలంగా నినాదాలు వల్లిస్తున్నారు. కాని పెడమార్గం పట్టిన ఈ రాజకీయ నిరుద్యోగుల వాదనలోని డొల్లతనాన్ని తెలంగా బిడ్డలే అయిన ఆ ఇరువురు మంత్రులూ ఇలా బయటపెట్టారు.



"హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల్లో భారతదేశంలోని అన్నివర్గాలు, మతాలు, కులాలు, వివిధ ప్రాంతాలకు చెందినవారు నివసిస్తున్నారు. అందువల్ల ఒకవేళ రాష్ట్రాన్ని విభజించవలసివస్తే నగరవాసులకు సకల ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకోవాలి. అందుకే హైదరాబాదు మహానగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి'' [16-01-2013 నాటి ప్రకటన]!



నాగేందర్, ముఖేష్ గౌడ్ ళ ప్రకటన పూర్వరంగంలో, తెలుగుజాతి ఐక్యతను భగ్నం చేసే రాజకీయ నిరుద్యోగులు తమ వేర్పాటువాదం చాటున పచ్చిఅబద్ధాలూ, విషప్రచారంతోటి తెలుగు ప్రజల పైననే చేస్తున్న సందర్భంలో ఒక ముఖ్యవిషయం మరుగున పడుతోందని గమనించాలి. మొత్తం ఉభయప్రాంతాలలోని తెలుగుజాతికి బద్ధశత్రువులుగా రాజ్యాలు ఏలిన పాలనావ్యవస్థలు రెండూ [నిజం, బ్రిటిష్ రాజ్యవ్యవస్థలు] పరాయివాళ్ళవే, ఆ పాలనల కింద నలిగిపోయిన వారిలో తెలుగువారితో పాటు మహారాష్ట్రులూ, కన్నడిగులు కూడా ఉన్నారు. కాగా, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కన్నడిగులూ, మహారాష్ట్రీయులూ తమతమ భాషా రాష్ట్రాలలో విలీనమైపోయారు.



అదే ప్రాతిపదికపైన ఆంధ్రప్రదేశ్ భాషా రాష్ట్రంలో విలీనమైపోయిన వారు పరాయి పాలనలలో మగ్గిన ఇరుప్రాంతాల (ఆంద్ర, హైదరాబాద్ సంస్థానంలోని తెలుగుప్రజలంతా)ప్రజలూ, రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాదును అభివృద్ధి చేయడంలో నాగేందర్, ముఖేష్ గౌడ్ లు చెప్పినట్టుగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారినేగాక, పంజాబీలు, రాజస్థాన్, మహారాష్ట్ర మార్వాడీలు, సింథీలు, కాశ్మీరీలు, తమిళులూ, అన్ని ప్రాంతాల ఎన్.ఆర్.ఐ.లూ కూడా బహుళసంఖ్యలో ఉన్నారు. అయినప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొందరు 'వేర్పాటు'వాదం చాటున దాటి తోటి తెలుగువారిపైనే విరుచుకుపడడం దేనికి?



ప్రతి విషయాన్నీ వివాదాస్పదం చేయవలసిన అవసరం ఏమొచ్చింది. హైదరాబాద్ అభివృద్ధిలో తెలంగాణాలోని మోతుబరులుసహా ఇతర ప్రాంతాలలోని సంపన్నులైన సోదర తెలుగు మోతుబరులు కూడా ఉన్నారు. వాటితోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన, ఉపాధికోసం పొట్టచేత పట్టుకుని జంటనగరాలలో అంతే స్థితిలో ఉన్న పేదబడుగువర్గాలతో కలిసి రెక్కలు ముక్కలు చేసుకుని బతుకులీడుస్తున్నవారు బహుళ సంఖ్యలోనే ఉన్నారు. అయినా, తెలుగువారి రాజధానీ నగరంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న తెలుగేతర రాష్ట్రాలకు చెందిన వారిని మినహాయించి వేర్పాటువాదులు సోదర తెలుగువారిపైన కాలుదువ్వడానికి సాహసించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పగలరా?




ఈ బాపతు ప్రచారకులు చరిత్రను మరిచిపోతున్నారు. మాహారాష్ట్ర, కర్నాటక యుద్ధాలలో దక్కన్ యుద్ధాల్లో దేశీయ రాజుల మధ్య కుమ్ములాటల్లో తలదూర్చి అస్తవ్యస్థ పరిస్థితులను దేశంలో సృష్టించిన ఫ్రెంచి, బ్రిటిష్ సామాజ్యశక్తులు రెండు విదేశీ వర్తకవాణిజ్య కంపెనీలను (ఫ్రెంచి-బ్రిటిష్) రంగంలోకి దించి ఇతోధికంగా 18-19 శాతాబ్దాలల్లో మొత్తం దక్కన్ భూభాగమంతటా ప్రజలను దోచుకు తిని, పిప్పిపిప్పి చేసి వదిలిన ఘట్టాలను వేర్పాటువాద సోదరులు మరిచిపోతున్నారు. లేదా మభ్యపెడుతున్నారు!



ఫ్రెంచివాళ్ళను తరిమేసి దక్కన్ లో పాగావేసిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దాని రాజకీయాధికార వ్యవస్థ అయిన బ్రిటిష్ పాలనాశక్తి పరమాధికార శక్తిగా ఇండియాలో అవతరించిన దరిమిలా ఇంగ్లీషువారిని అంటకాగినవారు నిజం పాలకులు, కర్నాటక, మహారాష్ట్రులతో నిత్యం తగాదాలతో ఉన్న నిజం పాలకులకు, బ్రిటిష్ వాళ్ళకి పొత్తు కుదిరింది. ఫలితంగా తమ రాజ్యప్రయోజనాల కోసం ఉభయులూ చేతులుకలిపారు.



ఆ వూపులో ఉత్తర సర్కారుల(కోస్తా)ను, రాయలసీమ జిల్లాలనూ నిజం పాలకులు స్వార్థప్రయోజనాలకోసం "అత్తసొమ్మును అల్లుడు దానం చేసిన''ట్టుగా బ్రిటిష్ వాడికి కట్టబెట్టి, అపారమైన పరిహారం పొంది, బలిశారన్న సంగతి వేర్పాటువాదులకు పరగడుపు అయిపోతే ఎలా? మైసూర్ యుద్ధాల్లో తాను కాజేసిన ప్రాంతాలను కూడా నిజంపాలకులు బ్రిటిష్ వాడికి డబ్బులకోసం అమ్మేశారన్న 'యాది'కూడా వేర్పాటువాదులకు లేకపోవడం హాస్యాస్పదం కాదా? తెలుగుప్రజల భూభాగాల్ని బ్రిటిష్ వాడికి అమ్మియా సొమ్ము చేసుకున్న పాపపు సంపదతోనే, తెలుగుప్రజల కష్టార్జితాన్ని తాకట్టుపెట్టిన ఫలితమే హైదరాబాద్ కు సోకులు దిద్దాడని మరచిపోరాదు. ఇప్పటికైనా వెనుతిరిగి చరిత్ర పాఠాలను చదివి, గుణపాఠం నేర్చుకుని బాధ్యతాయుత పౌరులుగా మెలగగలరని మనం ఆశించవచ్చా?

మరికొన్ని విషయాలను వచ్చే ఆర్టికల్ లో వివరిస్తాను ....