యువతను మేల్కొల్పిన డిల్లీ సంఘటన

 

డిల్లీలో జోరుగా సాగుతున్న యువత ఆందోళనలు క్రమంగా అదుపుతప్పి రాజకీయరంగు పులుము కొంటుంటే, గోడమీదకూర్చొని తమవంతు వచ్చేవరకు ఒప్పిగ్గా ఎదురు చూసిన రాజకీయపార్టీలు ఒకటొకటిగా రంగంలోకి దూకుతున్నాయి. ఇక మరో వైపు, భాదితురాలి ఆరోగ్యం గంటకో రకంగా ఉంటూ ఆందోళనకరంగా ఉంటోంది. ప్రభుత్వం డిల్లీ వీదులను ఎక్కడికక్కడ పూర్తిగా దిగ్బందిoచి వేయడంతో విద్యార్దుల ఆందోళనల పరిది మెల్లగా కుచించుకుపోయి ప్రస్తుతం జంతర్ మంతర్ ప్రాంతానికే పరిమితమయిపోయాయి.

 

అయితే, శరీరం గడ్డకట్టుకుపోయే చలిలోకూడా వారు కనబరుస్తున్న పట్టుదల అందరినీ అబ్బురపరుస్తుంటే, మరోవైపు ప్రభుత్వం ఎన్నిహామీలు ఇస్తున్నా, ఎన్నిచర్యలు చేపట్టినాకూడా విద్యార్దులు తమపట్టువీడకుండా అర్ధంలేని మొండితనం ప్రదర్శిస్తూ విమర్శలకి గురవుతున్నారు. యువతలో ఆవేశం ఉండటం సహజమే గానీ, చట్టాన్ని అమలు చేయాల్సిన బాద్యతగల ప్రభుత్వాలకి కూడా కొన్ని పరిమితులు ఆంక్షలు, విధి విధానాలు ఉంటాయని వారు గుర్తెరుగకపోవడం విచారకరం.

 

అంతకంటే విచారకరమయిన మరో విషయం ఏమిటంటే డిల్లీలో ఉవ్వెతున ఎగిసిపడుతున్న విద్యార్దుల ఆందోళనలకి మిగిలిన ఇతరరాష్ట్రాలతోబాటు మన రాష్ట్రయువత నుండి కూడా కనీస స్పందన కరువవడం. అక్కడక్కడ మొక్కుబడిగా నిరసన ర్యాలీలు జరిపి మమ అనిపించేసిన మన యువతలో స్పందించే గుణం తగ్గిపోయిందా లేక ఇటువంటి వాటికి తమ అమూల్యమయిన సమయం వెచ్చించడం అనవసరమని భావిస్తున్నారో తెలియదు, గానీ మొత్తం మీద పెద్దగాస్పందన లేదు. ఫేస్ బుక్, ట్వీటర్ లనే తమ జీవితపరమావదిగా భావిస్తూ రోజంతా వాటిమద్యనే కాలం గడిపే మన యువత ఈ ఘోర సంఘటనని తమ సోషల్ నెట్ వర్క్స్ ద్వారా తమ స్నేహితులతో పంచుకొని, ఎందుకు నిరసన తెలుపలేదో మరి తెలియదు.

 

ఒక వైపు డిల్లీలో నిరసనలు కొనసాగుతుండగానే, మరో వైపు దేశం నలుమూలలా ఉన్న మగమృగాలు తమ పైశాచిక మధనకాండ నిర్భయంగా, నిర్లజ్జగా కొనసాగించడం వారి తెంపరితనానికి, వ్యవస్థ పట్ల వారి నిర్లక్ష్యానికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు, ఈ చట్టాలు తమని ఏమి చేయలేవననే ధీమా అయినా అయిఉండాలి, లేదా యదావిదిగా ఈ నేరాలుకూడా ఎవరికంటాపడకుండా కప్పెయవచ్చును అనే దురాలోచన అయినా అయిఉండాలి. మన యువతలో సామజిక స్పృహ కరువవడం కూడా ఇటువంటి నేరస్తులకి దైర్యం ఇచ్చేదిగా ఉంది. మొత్తం మీద మహిళల మీదా, అభం శుభం ఎరుగని పసిపిల్లలమీడా అత్యాచారాలు మాత్రం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

 

ఇక ప్రభుత్వం కూడా విద్యార్దుల మొండితనంతో రోజు రోజుకి తన సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. “ఈరోజు విద్యార్దులు మమ్మలిని ఇండియా గేట్ వద్దకి చర్చలకి రమ్మని పిలిచేరు. రేపు మరో రాజకీయ పార్టీయో లేక మావోయిస్ట్ పార్టీయో కూడా అక్కడికి రమ్మంటే మేము వెళ్ళాలా?” అని కోపంగా ప్రశ్నించేరు హోం మంత్రి షిండేగారు. ఆయన మాటలు విద్యార్దులను రెచ్చగొట్టవచ్చును, గానీ, ఆయన మాటల్లో సహేతుకతకూడా ఉంది. ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. దానిని నడిరోడ్డు మీదకు లాగాలనుకోవడం అంటే దానిని అవహేళన చేస్తునట్లే భావించాల్సి ఉంటుంది. అటువంటి చర్యలద్వారా మన వ్యవస్థ ఎంత బలహీనమయినదో తెలియని వారికి సైతం పిలిచిచెప్పినట్లే అవుతుంది. అది భారతీయులమయిన మనకి అవమానకరం. ఇతర దేశాల, వ్యవస్థల దృష్టిలో మన దేశాన్ని, మన ప్రభుత్వాన్ని మనమే పలుచన చేసుకొన్నట్లవుతుంది. యువత దేశానికి బలమయిన ఆలంబనగా నిలవాలే తప్ప దానికి గొడ్డలిపెట్టుగా మారకూడదు. యువత సామాజిక, రాజకీయ స్పృహ చూపడం ఎంత అవసరమో, దానిని దేశప్రయోజనాలకి అనుకూలంగా ఉపయోగించడం కూడా అంతకంటే ముఖ్యం.

 

తమ చైతన్యాన్ని తగిన సమయంలో తగిన విదంగా, తగిన మోతాదులో ఉపయోగించినప్పుడే వారి శక్తియుక్తులు బయటపడి ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఉదాహరణకి, 76 సం.ల కురు వృద్దుడు అన్నాహజారే కూడా లోక్పాల్ బిల్లు కోసం పోరాటం చేసారు. అయితే దానిని ఎంతవరకు కొనసాగించాలో అంతవరకే చేసి విరమించేరు. అలాగని ఆయన తన లోక్పాల్ ఉద్యమాన్నిపక్కన పెట్టేయలేదు. ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ ఆయన “నేను లోక్పాల్ బిల్లు పేరుతొ జనసమీకరణ చేసి నా బాల ప్రదర్శన చేయాలనుకోవట్లేదు. దాని ద్వారా జనాలను చైతన్యపరచాలనే అనుకొంటున్నాను,” అని చెప్పడం ద్వారా ఆయన ఏదయినా ఒక ప్రయోజనం ఆశించి మొదలుపెట్టిన ఉద్యమాన్ని ఏవిదంగా నడిపించాలో తెలియజేసారు. డిల్లీ యువత కూడా ఇది గ్రహించాలి.

 

ముందు శాంతియుతంగా మొదలయిన తమ ఆందోళనలు నేడు ఆహింసాత్మకంగా ఎందుకు మారాయి? ఎవరి రాకతో మారాయి? అని వారినివారే ప్రశ్నించుకోవలసిన అవసరం వచ్చిందిప్పుడు. తమ ఉద్యమాల వల్ల ఒక పోలీసు ఉద్యోగి ప్రాణాలు కోల్పోయేడంటే ఎంత అవాంచనీయ పరిస్తితులు తాము సృష్టించేరో వారు తెలుసుకోవాలి. తమ ఉద్యమాలు పక్కదారి పట్టి తమకే చెడ్డపేరు తెస్తున్నాయని గ్రహించగలిగితే, తాత్కాలికంగానయినా వాటిని విరమించి మళ్ళీ ప్రభుత్వంలో చొరవకకొరవడిననాడు ఉద్యమించి దాని బాద్యతలు గుర్తు చేయవచ్చును. అదే విదంగా దేశవ్యాప్తంగా ఉన్నయువత కూడా ఇటువంటి దురాగతాలు మళ్ళీ పునారావృతం కాకుండా తామేమి చేయగలమో ఆలోచించాలి.