సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ కు ఊరట

 

మాంసం ఎగుమతి చేసే వ్యాపారవేత్త మోయిన్‌ ఖురేషిపై మనీలాండరింగ్‌, అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు రాగా ఆయనపై సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కేసులో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ అస్తానా ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది.అయితే, ఖురేషి నుంచి ఆయన లంచం డిమాండ్‌ చేసి తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.దీంతో ఆస్థానా, సీబీఐ డీఎస్పీ దేవందర్‌ కుమార్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.కోర్టు జోక్యం చేసుకొని తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని, తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.నిందితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానాపై అక్రమంగా ఎఫ్‌ఆఐర్‌ నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయస్థానం ఆస్థానాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబరు 29కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అప్పటి వరకు ఆస్థానాపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్టు చేయడం వంటివి చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి నిందితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తదితర పత్రాలను భధ్రపరచాలని సూచించింది.