ఆక్సిజన్ ట్యాంకర్ దొంగిలించారు! రెండు రాష్ట్రాల మధ్య ఫైట్

రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు ఎక్కువగా ఉంటాయి. జల వివాదాలు తీవ్రంగానే చూశాం. ఇప్పటికి పలు రాష్ట్రాల మధ్య జల జగడాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి వాటా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడిన సందర్భాలు ఉన్నాయి. కాని కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఆక్సిజన్ కోసం గొడవలు జరుగుతున్నాయి. తమ రాష్ట్రానికి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ను పక్క రాష్ట్రం దొంగతనంగా తరలించుకుపోయిందని ఓ రాష్ట్ర మంత్రి ఆరోపించడం కలకలం రేపుతోంది. దేశంలో కరోనా తీవ్రత ఎంతలా ఉందో స్పష్టం చేస్తోంది. 

తమ రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒకదాన్ని ఢిల్లీ ప్రభుత్వం దొంగతనంగా తీసుకెళ్లిందని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మండిపడ్డారు. ఫరీదాబాద్ కు నిన్న వస్తున్న ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం తీసుకెళ్లిందని తెలిపారు. అప్పటి నుంచి ఆక్సిజన్ ను తీసుకొస్తున్న వాహనాలకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఇలాంటి పనులకు పాల్పడితే, ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. తమ ఆక్సిజన్ ను ఢిల్లీకి పంపించాలని ఒత్తిడి వస్తోందని... వారికి ఆక్సిజన్ పంపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే తాము ఆ పని చేయగలమని స్పష్టం చేశారు. అనిల్ విజ్ హర్యానా హోం మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.

దేశంలో ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజిన్ సరిపడా అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఏమి చేయలేకపోతున్నారు. తమ రాష్ట్రానికి ఎక్కువ ఆక్సిజన్ పంపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు ముఖ్యమంత్రులు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండటంతో హర్యానాకు తరలించాల్సిన ట్యాంకర్ ను మధ్యలోనే ఢిల్లీకి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం రాష్ట్రాలు బహిరంగంగానే ఘర్షణలు పడుతుండటం దేశంలో కరోనా వైరస్ కల్లోలం ఏ స్థాయిలో ఉందో సూచిస్తోంది.