డిల్లీ కేసును కమ్ముకొంటున్న (నీచ) రాజకీయాలు

 

మన రాజకీయ నేతలు ఎటువంటి సున్నితమయిన అంశానయినా తమ రాజకీయకోణం నుంచే చూస్తారు తప్ప వేరేగా చూడలేరు. తమ రాజకీయలబ్దికి ప్రతీ అంశం ఏవిదంగా ఉపయోగపడుతుందా అని చూస్తారు తప్ప, డిల్లీ అత్యాచార సంఘటనలపట్ల స్పందించవలసిన విదంగా స్పందించరు. ఒక సమస్య ఏర్పడినప్పుడు దాని పరిష్కారానికి ప్రయత్నించకపోగా, దానిని ఉపయోగించుకొని తమ విరోధి పార్టీలను ఏవిదంగా అభాసుపాలు చేవచ్చునో అని మాత్రమే ఆలోచిస్తారు.

 

డిల్లీ సంఘటనపై క్రమంగా వేడి చల్లారుతున్న సమయంలో డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, డిల్లీ పోలీసులపై ఆరోపణలు మొదలుపెట్టేరు. భాదితురాలి మొదటి వాంగ్మూలము తీసుకోనేందుకు వెళ్ళిన డిల్లీ సబ్ డివిసినల్ మాజిస్ట్రేట్ ఉషచతుర్వేదిని కొందరు డిల్లీపోలీసు అధికారులు ఆమె బాధితురాలిని ఏమి ప్రశ్నించాలో తెలియజేస్తూ వారే ఆమెచేతికి ఒక ప్రశ్నాపత్రం ఇచ్చినందువల్ల, ఆమె బాదితురాలి వాంగ్మూలము తీసుకోకుండానే వెనుదిరిగిందని, ఇటువంటి సున్నిత విషయాలలో పోలీసుల ‘అతి’ని అదుపు చేయవలసిన పోలీసు కమీషనరు బాధ్యతా రహితంగా వ్యహరించాడని, కనుక, వెంటనే ఈ విషయం పై హోంశాఖ విచారణ జరపాలని కోరుతూ షీలాదిక్షిత్ హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేకు ఒక లేఖ వ్రాసారు. ఆమె తన లేఖలో హోంశాఖ అదీనంలో ఉన్న డిల్లీ పోలీసులను డిల్లీ ప్రభుత్వానికి అప్పజెప్పాలని కూడా కోరారు. ఆమె డిల్లీ పోలీసులు హోంశాఖ అదీనంలో ఉనందుకు బాధపడుతున్నారా లేక వారు మాజిస్ట్రేట్ ని వాంగ్మూలము తీసుకోకుండా అడ్డుపడినందుకు ఆమె ఈ రకమయిన ఆరోపణలు మొదలు పెట్టారానేది ఆలోచించవలసిన విషయం.

 

డిల్లీ పోలీసులు మాత్రం, బాదితురాలి తల్లితండ్రులు అభ్యర్దన మేరకే తాము ఆవిధంగా చేయవలసి వచ్చిందని చెపుతూ, మళ్ళీ మరోసారి బాదితురాలి వాంగ్మూలము నమోదు చేసారు. అయితే, షీలా దీక్షిత్ హోంమంత్రికి వ్రాసినలేఖ ఎలా బహిర్గతం అయిందో కనిపెట్టేందుకు ఒక విచారణ కమిటీని హోంశాఖ నియమించాలని వారు కోరారు.

 

మరో వైపు ఈ డిల్లీ సంఘటనను చర్చిందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని భారతీయ జనత పార్టీ రాష్ట్రపతిని కోరింది.

 

కాంగ్రెస్ పార్టీ మొన్న డిల్లీలో ఇండియా గెట్ వద్ద జరిగిన అల్లర్లలో అరవింద్ కేజ్రివాల్ కొత్తగా పెట్టిన ‘ఆమ్మ్ ఆద్మీ పార్టీ’ కార్యకర్తల దాడిలో ఒక పోలీసు చనిపోయాడని , తమ కార్యకర్తలని రక్షించునేందుకు ఆ పార్టీ పోలీసుల మీద రాజకీయ ఒత్తిడి తెస్తోందని ఆరోపించింది.

 

కాంగ్రెస్ ఆరోపణలకు ప్రతిస్పందించిన అరవింద్ కేజ్రివాల్ ఇండియా గెట్ వద్ద జరిఇన అల్లర్లలో తమ పార్టీ వారెవరూ లేరని, ఒకవేళ ఉన్నట్లయితే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చునని ప్రకటన విడుదల చేసారు.

 

ఇంతవరకు, ఈ దుర్ఘటనపై స్పందిచని రాజకీయపార్టీలు కూడా, మరికొద్దిరోజుల్లో తమ పాత్ర పోషించేందుకు ముందుకువచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు.