ముసలాయన పొట్టలో 12 బంగారు బిస్కెట్లు

 

ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రికి స్థానిక వ్యాపారి అయిన ఒక ముసలాయన వచ్చాడు. తాను మంచినీళ్ళు తాగుతూ వుండగా పొరపాటుగా బాటిల్ మూత గొంతులో పడి పొట్టలోకి వెళ్ళిపోయిందని, దాన్ని ఆపరేషన్ చేసి బయటకి తీయండని రిక్వెస్ట్ చేశాడు. ఎక్స్ రే, స్కానింగ్ గట్రాలు చేసిన డాక్టర్లకి పొట్టలో బాటిల్ మూత అయితే కనిపించలేదుగానీ, ఏవో లోహం తాలూకు ఆనవాళ్ళు కనిపించాయి. డాక్టర్లు ఆ ముసలాయనకి ఆపరేషన్ చేస్తే పొట్టలోంచి మొత్తం 12 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని డాక్టర్లు పోలీసుల చెవిలో వేశారు. పోలీసులు వచ్చి ముసలాయన్ని ఇంటరాగేట్ చేస్తే అసలు విషయం బయటపడింది. మొన్నీమధ్యే సదరు ముసలాయన సింగపూర్ వెళ్ళొచ్చాడు. సింగపూర్‌ నుంచి ఇండియాకి బంగారం తెచ్చుకోవాలని ముచ్చటపడ్డాడు. మామూలుగా అయితే కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోతానని ఎంచక్కా పన్నెండు బంగారు బిస్కెట్లు మింగేశాడు. కస్టమ్స్ దగ్గర ఎలాంటి ఇబ్బందీ రాలేదుగానీ, ఆ తర్వాతే ముసలాయనకి అసలు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తాను మింగిన 12 బంగారు బిస్కెట్లు నంబర్ టూకి వెళ్తే బయటపడిపోతాయని అనుకున్నాడు. కానీ అలాంటిది జరగకపోవడంతో టెన్షన్ పడిపోయాడు. బాటిల్ మూత సాకు చెప్పి ఆస్పత్రిలో చేరాడు. ఆపరేషన్ చేసిన డాక్టర్లు మీ పొట్టలో బంగారం మీదే అని తనకే ఇచ్చేస్తాడని అనుకున్నాడు. అయితే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముసలాయన ప్లాన్ అడ్డం తిరిగింది.