నెల రోజుల్లో తెలంగాణ

 

 

 Decision on Telangana this month, Telangana issue congress. congress Telangana issue

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ నెల రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముందని, ఆ దిశగా మరికొన్ని సమావేశాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ తెలిపారు.తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు గత కొన్నేళ్లుగా తాము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులతో సమావేశాలు జరుపుతున్నామని, తాను కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో భేటీ అయ్యానని ఆజాద్ తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలతో ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యానని గుర్తు చేశారు.


"సీట్ల కోసం కాకుండా తెలంగాణను ఆశిస్తున్న వారు ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. పార్టీ తీసుకునే తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. మేం తుది నిర్ణయం తీసుకునే వరకూ మరే ఇతర నాయకుడూ టీఆర్ఎస్‌లో చేరరు'' అని ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు ఈ నెలలోనే మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, తెలంగాణలో ఉన్న సమస్యలను తాము ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ఈ క్రమంలో గతంలో ఉద్యోగాల భర్తీ సమస్య ఎదురైనప్పుడు తాము వెంటనే దానిని పరిష్కరించామని గుర్తు చేశారు.


తెలంగాణ ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రిని కూడా నియమించామని వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి గురించి ప్రస్తావించగా.. దానికి కారణాలు ఉన్నాయన్నారు. జగన్ పార్టీని వీడారని, ఆయన ఎందుకు అలా చేశారో అందరికీ తెలుసునని చెప్పారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా ఎన్నడూ ప్రభుత్వానికి మద్దతు పలక లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.