ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా లేదా..?

 

ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందా ఉండదా అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా తీసుకున్న భూముల్లో నిర్మాణాలకు భారీ వ్యయం అవుతుందని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. పైగా భారీ నిర్మాణాలకు ఆ భూములు సరైనవి కావని కూడా మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలోనే ప్రకటించారు. అందుకే రాజధాని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేయడం కోసం నిపుణులతో ఒక కమిటీని నియమించింది ప్రభుత్వం, ఇందు కోసం విధి విధానాలను జారీ చేసింది.

నిపుణుల కమిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. సమాచార సేకరణ కోసం అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగులతో సంప్రదింపులు జరిపి అధికారాన్ని కమిటీకీ ఇచ్చింది ప్రభుత్వం. క్షేత్ర స్థాయి పర్యటనలు జరిపి వివిధ వర్గాలతో కమిటీ సంప్రదింపులు జరుపుతోంది. కమిటీ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సిబ్బంది ఇతర అవసరాలను సీఆర్డీయే సమకూరుస్తుంది. నిపుణుల కమిటీ ప్రభుత్వానికి మధ్య నోడల్ ఆఫీసర్ గా సీఆర్డీయే అదనపు కమిషనర్ విజయకృష్ణన్ వ్యవహరిస్తారు.

కమిటీ తొలి సమావేశం నిర్వహించిన ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలియజేసింది. రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వం చేసిన నిపుణుల కమిటీ త్వరలోనే రాష్ట్ర మంతా పర్యటిస్తోందని వెల్లడించారాయన. రాజధాని ఎక్కడ వుండాలి, ఎలా ఉండాలో కూడా ఆ కమిటీ సూచిస్తుందన్నారు. ఆ నివేదికపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు బొత్స. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని హై కోర్టు కోసం వినిపిస్తున్న డిమాండ్ లు కూడా అందులో భాగమేనని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స.