పవన్‌పై మండిపడుతున్న నెటిజన్లు

అమెరికాలోని డల్లాస్‌ టయోటా మ్యూజిక్‌ ఫ్యాక్టరీ వేదికగా జరిగిన జనసేన ప్రవాసగర్జన సభలో ప్రవాస భారతీయుల నుద్దేశించి పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తూ... అమెరికా నడిబొడ్డున భారత ఔన్నత్యాన్ని చాటేందుకు వచ్చాను తప్ప విరాళాల సేకరణ కోసం రాలేదని అన్నారు. మానవత్వం తప్ప తనకు రాజకీయాలు తెలియవని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. దేశాన్ని మార్చేస్తానని చెప్పానని.. తుది శ్వాస విడిచేలోగా ఎంతో కొంత మార్పును తెస్తానని పవన్‌ పేర్కొన్నారు. మన రాజకీయ వ్యవస్థలో ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లలేకపోయాం. అక్కడ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. నిధులున్నా, సిబ్బంది ఉన్నా రాజకీయ సంకల్పం లేకనే చాలా సమస్యలు మిగిలిపోతున్నాయి అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల గురించి మాట్లాడుతూ.. భగత్‌ సింగ్‌ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను చదవాలని సూచించారు. అయితే భగత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకోలేదని, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్‌ వారిపై హింసాత్మక ఉద్యమం చేపట్టి.. వారి చేతిలో ఉరితీయబడ్డారని అందరికీ తెలిసిందే. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం పొరపాటుగా భగత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పవన్ పొరపాటుగా మాట్లాడిన మాటలను పవన్ అభిమానులు సమర్ధించుకుంటూ... చంద్రశేఖర్‌ అజాద్‌ పేరు బదులు భగత్‌ సింగ్‌ పేరును పొరపాటుగా ప్రస్తావించారు అని అంటున్నారు. బ్రిటీష్‌ పోలీసులు చుట్టుముట్టడంతో ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్నప్పుడు చేసిన శపథం నిజం చేస్తూ ఆజాద్‌ తన తుపాకీతో కాల్చుకుని వీరమరణం పొందిన విషయం మీకు తెలిసిందే.