దగ్గుబాటి రాజకీయ సన్యాసం...ఎందుకు?

 

రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో పెట్టేందుకు రాష్ట్ర విభజన అంశం ఎత్తుకొన్న సోనియాగాంధీ, అందుకోసం సీమాంధ్రలో తన పార్టీని, పార్టీ నేతల భవిష్యత్తుని బలిగోనేందుకు కూడా వెనుకాడలేదు. ఆమె పుణ్యామాని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లు చెల్లచెదురయిపోతే, మరికొందరు ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకోక తప్పలేదు. పాము తన పిల్లలని తానే తిన్నట్లుగా ఉందిది. ఇప్పటికే లగడపాటి రాజకీయ సన్యాసం స్వీకరించగా ఇప్పుడు మరో కరడుగట్టిన కాంగ్రెస్ వాది దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ మరియు కుటుంబ కారణాల రీత్యా తను రాజకీయ ల నుండి తప్పుకొంటున్నట్లు ఆయన తెలిపారు.

 

అయితే నిన్ననే దగ్గుబాటి దంపతులిరువురూ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించి, మళ్ళీ ఇంతలోనే ఆయన మనసు మార్చుకొని ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకొంటున్నట్లు ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పరుచూరు శాసనసభ నియోజక వర్గం నుండి మళ్ళీ పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లు సమాచారం. అదేవిధంగా గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేసినందున, త్వరలో బీజీపీ సీమాంధ్ర శాఖను ఏర్పాటు చేసినట్లయితే ఆయనకు పార్టీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కూడా ఉంది. ఇటువంటి మంచి తరుణంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకోవాలని భావించడం వెనుక బలమయిన కారణాలే ఉండి ఉండవచ్చును.    

 

ప్రస్తుతం బీజేపీ-తెదేపాలు ఎడమొహం పెడమొహంగా ఉన్నపటికీ, త్వరలోనే ఆ రెండు ఎన్నికల పొత్తులు పెట్టుకోవచ్చును. ఒకవేళ ఆయన బీజేపీలో చేరినట్లయితే, ఏదో ఒక సందర్భంలో తను వ్యతిరేఖించే తన తోడల్లుడు చంద్రబాబుతో పార్టీ వ్యవహారాల నిమ్మితం కలవ వలసి ఉంటుంది. బహుశః అది ఇష్టం లేని కారణంగానే ఆయన బీజేపీలో చేరేందుకు వెనుకాడి ఉండవచ్చును. అయితే అందుకు రాజాకీయ సన్యాసం తీసుకోనవసరం లేదు. ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా నయినా పోటీ చేసి గెలువవచ్చును. కానీ, రానున్న ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమయిన మెజార్టీ రాని పక్షంలో, ఆయన అయిష్టంగానయినా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయవలసి రావచ్చును. అటువంటి బేరసార రాజకీయాలకు బొత్తిగా ఇష్టపడని కారణంగానే ఆయన రాజకీయాల నుండి తప్పుకొని ఉండవచ్చును.