దగ్గుబాటికి బీజేపీ గాలం?

 

 

 

సీమాంధ్రలో బలపడుతున్న భారతీయ జనతాపార్టీ అనేకమంది కాంగ్రెస్ నాయకులను ఆకర్షిస్తూ తనలో కలిపేసుకుంటోంది. సీమాంధ్రలో బీజేపీ సాధించిన అచీవ్‌మెంట్స్ లో కేంద్ర మాజీ మంత్రిణి దగ్గుబాటి పురంద్రేశ్వరి పార్టీలో చేరడం ఒకటి. లేటెస్ట్ గా కావూరి కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. చాలామంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ వైపు చూస్తుంటే, బీజేపీ మాత్రం కొందరు కీలక నాయకుల వైపు చూస్తోంది. వాళ్ళలో ముందు వరుసలో వుండే నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

 

దగ్గుబాటి భార్య ఎలాగూ బీజేపీలోనే వుంది. ఆమెతోపాటు వెంకటేశ్వరరావును కూడా పార్టీలోకి తీసుకుంటే సీమాంధ్రలో బీజేపీ మరింత బలపడే అవకాశం వుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అయితే రాష్ట్ర విభజన విషయంలో అనుసరించిన దుర్మార్గమైన పద్ధతి కారణంగా నొచ్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కొంతమంది సన్నిహితులు దగ్గుబాటి మనసు మార్చడానికి ప్రయత్నాలు చేసిన ఆయన తన పట్టు విడవలేదు. అయితే దగ్గుబాటి లాంటి మిస్టర్ క్లీన్ నాయకుడు తమ పార్టీలో వుండటం ఎంతో మంచిదని భావిస్తున్న బీజేపీ దగ్గుబాటిని తిరిగి రాజకీయ రంగప్రవేశం చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది.



ఆయనను ఒప్పించే బాధ్యతను పురంధ్రేశ్వరి మీద వేసినట్టు సమాచారం. అయితే దగ్గుబాటి ఒక పట్టాన లొంగే మనిషి కాకపోవడంతో ఆయన్ని ఎలా ఒప్పించాలో తెలియక చిన్నమ్మ కూడా మథనపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ దగ్గుబాటి నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోయినప్పటికీ ఒక వారం రోజుల్లో ఆయన తమ పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుందని బీజేపీ నాయకులు ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు.