బాబు సభకి హరికృష్ణ, కడియం, దాడి డుమ్మా

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎంతో ఘనంగా, ఆర్భాటంగా జరుగుతున్నచంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకి హరికృష్ణ రాకపోవచ్చునని అందరూ ఊహిస్తున్నపటికీ, ఎవరూ ఊహించని విదంగా తెదేపా సీనియర్ నేతలు కడియం శ్రీ హరి మరియు దాడి వీరభద్రరావులు కూడా మొహం చాటేశారు.

 

గతంలో తనకు ప్రాదాన్యం ఈయలేదని మోత్కుపల్లి నరసింహులు అలిగితే, చంద్రబాబు ఆయనను ఎలాగో బుజ్జగించుకొని దారికి తెచ్చుకొన్నారు. కానీ ఇటీవల పార్టీ తెలంగాణా ఫోరం సమావేశంలో కడియం, మోత్కుపల్లి మద్య మొదలయిన ‘పార్టీలో చీడపురుగుల గొడవ’ ముదిరినప్పుడు చంద్రబాబు మొత్కుపల్లిని వారించకపోవడంతో మనస్తాపం చెందిన కడియం ఈ సభకి మొహం చాటేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలకి మనస్తాపం చెంది సభకు రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు.

 

ఇక దాడి వీరభద్రరావు తనని మళ్ళీ రెండో సారి శాసనమండలికి నామినేట్ చేయనందుకు అలిగిన సంగతి తెలిసిందే. కానీ వచ్చే ఎన్నికలలో ఆయనకి లోక్ సభ టికెట్, ఆయన కొడుక్కి శాసనసభ టికెట్ కోరుతునట్లు సమాచారం.

 

ఇక హరికృష్ణ ఇటీవల జరిగిన పరిణామాలతో పార్టీకి మరింత దూరం అయినట్లు కనిపిస్తోంది. అందుకు చంద్రబాబు కూడా చింతిస్తున్నట్లు లేదు.

 

నిన్న ఈనాడు న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో “మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం.  తల్లి కాంగ్రెస్ లోఒకరు, పిల్ల కాంగ్రెస్ లో మరొకరు మావాళ్ళున్నారు. పార్టీకోసం అవసరమయితే కుటుంబ సభ్యులను కూడా వదులుకోవడానికి సిద్దం” అని చెప్పడం ఆయనను ఉద్దేశించినవేనని భావించవచ్చును.

 

ఇటువంటి పరిస్థితుల్లో ఈ సభకు హరికృష్ణ వస్తారని ఎవరూ భావించలేదు. కానీ, తన జీవితాంతం తెదేపా లోనే ఉంటానని, పార్టీ కోసమే పని చేస్తానని చెప్పిన జూ.యన్టీఆర్ ను కూడా సభకు పంపకపోవడం ద్వారా హరికృష్ణ తమ అభిప్రాయం చాలా స్పష్టంగానే తెలియజేసారు. అంతిమంగా ఈ పరిణామాలన్నీ తెదేపాలో ఉన్న అంతర్గత విబేధాలను మరోమారు బయట పెట్టింది. అంతే గాకుండా ఇప్పటికే ఉన్న దూరాన్ని మరింత పెంచింది.