కిరణ్, బొత్స అధిష్టానం మాటకి కట్టుబడితే బెటర్: డీ.యస్

 

రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన సీమంధ్ర నేతలని వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారని, సమైక్యాంధ్ర ఉద్యమాలు హోరెత్తుతున్నావాటిని అదుపుచేసే ప్రయత్నం చేయడం లేదని స్వపక్షంలో నేతలు, తెరాస నేతలు విమర్శిస్తుంటే, రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేలు వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిలా రాష్ట్రంలో అరాచకం నెలకొన్నా, పరిపాలన స్తంభించినా చేష్టలుడిగి ప్రజలకి కనబడకుండా దాకోన్నాడని తెదేపా నేత సోమిరెడ్డి విమర్శించారు.

 

ఇక మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ మాట్లాడుతూ “కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరూ కూడా పార్టీ అధిష్టానం చేసిన నిర్ణయానికి కట్టుబడి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అన్ని విధాల సహకరించాలి. అధిష్టానం వారిరువురినీ కూడా సంప్రదించిన తరువాతనే నిర్ణయం తీసుకొంది గనుక, వారు తమకిష్టమున్నా లేకున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ కూడా పార్టీనిర్ణయాన్ని అమలుచేయవలసిన బాధ్యత తమపై ఉందని జ్ఞాపకం ఉంచుకొని తదనుగుణంగా వ్యవహరించాలి. రాష్ట్ర విభజనపై ఎవరికయినా అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని విని పరిష్కరించేందుకు ఆంథోనీ నేతృత్వంలో వేసిన కమిటీకి నివేదించుకోవచ్చును,” అని అన్నారు.

 

ఇటువంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నపుడు, అశాంతి నెలకొని ఉన్నపుడు రాష్ట్ర పెద్దగా ఆయన చొరవ తీసుకొని పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేయాలి. కనీసం మీడియా ద్వారానయినా ప్రజలతో సంబంధాలు నెలకొలుపుకొని, వారి భయాందోళనలు దూరం చేసే ప్రయత్నాలు చేయాలి. అంతా సవ్యంగా ఉన్నపుడు క్షణం కార్యాలయంలో కూర్చోకుండా రాష్ట్రమంతా చుట్ట బెడుతూ స్వోత్కర్ష చేసుకొనే ఆయన, రాష్ట్రంలో తీవ్ర అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నవేళ, పరిపాలన పూర్తిగా స్తంభించిన వేళ, కీలకమయిన రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్నవేళ, రాష్ట్ర సమస్యలతో, ప్రజలతో తనకేమి సంబంధం లేనట్లు ఆయన తన గుహలోకి వెళ్లిపోయి కూర్చొవడం చాలా తప్పు. డీయస్ చెప్పినట్లు, ఆయన తప్పనిసరిగా పార్టీ నిర్ణయాన్నిఖచ్చితంగా అమలు చేయాలి. అలా చేయడం ఇష్టం లేదనుకోన్నపుడు తన పదవికి రాజీనామా చేసి గౌరవంగా తప్పుకోవడం మంచిది.

 

ప్రజలను, ప్రభుత్వాన్ని, పాలనను గాలికొదిలేసి ఈవిధంగా కూర్చోవడం వలన ఇంత కాలం ఆయన సంపాదించుకొన్న మంచి పేరు పోగొట్టుకోవడమే కాక ఆయన రాజకీయ భవిష్యత్ కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. అటు తెలంగాణా ప్రజల నమ్మకం కోల్పోయి, ఇటు ఆంద్ర ప్రజల నమ్మకం కోల్పోతే రాజకీయంగా నష్టపోయేది ఆయనేనని తెలుసుకోవాలి.