షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ: కరెంటు తీగ

 

తారాగణం: మంచు మనోజ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, పృథ్వి.

 

సాంకేతిక నిపుణులు: సంగీతం: అచ్చు, ఫొటోగ్రఫీ: సతీష్ ముత్యాల, నిర్మాత: మంచు విష్ణు, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి .

 

మాస్, కామెడీ అంశాలతో రూపొందిన సినిమా ‘కరెంటు తీగ’. ఆడపిల్ల పుట్టడాన్ని వ్యతిరేకించే వారికి కనువిప్పు కలిగే సెంట్రల్ పాయింట్‌తో రూపొందిన ఈ సినిమాలో మాస్ మసాలా బాగా దట్టించారు. పార్వతీపురం అనే గ్రామానికి పెద్ద అయిన శివరామరాజు (జగపతిబాబు), అతని ప్రత్యర్థి వీర్రాజు (సుప్రీత్), ఆ ఊళ్ళో అన్యాయాలను వ్యతిరేకించే రాజు (మనోజ్), రాజు ప్రేమలో పడిన శివరామరాజు కూతురు కవిత (రకుల్ ప్రీత్ సింగ్), ఆ ఊరికి వచ్చిన టీచర్ (సన్నీ లియోన్) మధ్య జరిగే కథతో రూపొందిన సినిమా ఇది.

 

‘కరెంట్ తీగ’లో మనోజ్ ఓ మాస్ క్యారెక్టర్‌ను పోషించాడు. మాస్ ఎలిమెంట్స్‌కు తనదైన హాస్యాన్ని, టైమింగ్‌తో మనోజ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మనోజ్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు.

 

అలాగే రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు కొంత స్కోప్ ఉండే పాత్ర ధరించింది. తనకు లభించిన అవకాశాన్ని రకుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే.. ఫెర్ఫార్మెన్స్ విషయంలో కొంత మెచ్చురిటీ సాధించింది. టీచర్ పాత్రలో సన్నీలియోన్ హాట్‌ హాట్‌గా కనిపించించింది. జగపతిబాబు గ్రామపెద్దగా, ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఓ బరువైన పాత్రను ధరించి కథకు వెన్నెముకగా నిలిచాడు.

 

కామెడీ కథలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన దర్శకుడు నాగేశ్వరరెడ్డి మనోజ్‌లో ఉండే ఎనర్జీని చక్కగా తెరక్కించాడు. రొటిన్ కథకు కామెడీ, యాక్షన్, సెంటిమెంట్‌ను జోడించి మనోజ్‌ను కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశారు.