ఆ ఐదుగురు మాజీ మంత్రుల పరిస్థితి ఇఫ్పుడెలా ఉందో తెలుసా?

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పిన ఐదుగురు మాజీ మంత్రులు, ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారే నాగం జనార్ధన్‍ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ, పి.చంద్రశేఖర్‍, లక్ష్మారెడ్డిలు. ఇందులో ఒక్క లక్ష్మారెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మిగతా వారు నాగం, జూపల్లి, డీకే అరుణ, పి.చంద్రశేఖర్‌లు, పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకుంటున్నారన్న చందంగా మారింది వారి పరిస్థితి.

నాగం జనార్థన్‌ రెడ్డి, పి.చంద్రశేఖర్‍. ఇద్దరూ ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలో అత్యంత సీనియర్‍ నాయకులు. తెలుగుదేశం హయాంలో ఈ ఇద్దరూ ఐదుసార్లు మంత్రులుగా కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగం... నాగర్‍ కర్నూల్‍ నుంచి కాంగ్రెస్‍ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. పి.చంద్రశేఖర్‍ మాత్రం టీడీపీని వీడి మొదట టీఆర్‍ఎస్‍ లో చేరారు. అక్కడ టిక్కెట్‍ రాకపోవడంతో టీఆర్‍ఎస్‍ ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అక్కడా కూడా చంద్రశేఖర్‍ కు నిరాశే మిగిలింది. తర్వాత కమలం గూటికి చేరి, ప్రస్తుతం ఆ పార్టీలోనే ఉన్నానంటే ఉన్నా అన్నట్టున్నారు.

ఇక, కాంగ్రెస్‍ పార్టీలో సీనియర్‍ నాయకులుగా కొనసాగిన జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ సైతం గడ్డుకాలాన్ని చవిచూస్తున్నారు. ప్రస్తుతం జూపల్లి టీఆర్‍ఎస్‍ లో ఉంటే, అరుణ బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి చెందడంతో ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు తీవ్ర సంక్షోభంలో పడింది. ఇందులో జూపల్లి కృష్ణారావు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. మున్సిపల్‍ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా... అధిష్టానం మాత్రం జూపల్లిపై సస్పెన్షన్‍ వేటు వేయలేదు. దాంతోపార్టీలో ఉండాలా, కొనసాగాలా అన్న నిర్ణయాన్ని జూపల్లికే వదిలేసినట్టు కనిపిస్తోంది. జూపల్లి పార్టీలో ఉన్నా కనీసం ఆయనకు ఓ కార్యకర్త అన్న గుర్తింపూ ఇవ్వడంలేదట గులాబీ అధిష్టానం. దాంతో పార్టీలో కొనసాగలేక, ఉండలేక తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు జూపల్లి. ఇటు మరో డీకే అరుణ సైతం గద్వాల అసెంబ్లీ, మహబూబ్‍నగర్‍ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి, రెండుమార్లు ఓటమి చెందారు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా కమలం నేతలు కనిరించడం లేదని తెలుస్తోంది.

ఇక మిగిలిన ఒక్క మాజీ మంత్రి లక్ష్మారెడ్డిదీ అదే సమస్య. జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. ఉద్యమ నాయకుడిగా ముద్ర ఉన్న లక్ష్మారెడ్డికి... కేసీఆర్‍ తన మంత్రివర్గంలో మొండిచెయ్యి చూపించడం తీవ్ర అవమానంగా భావిస్తున్నారట. మొదటి విడత, రెండో విడతలోనూ మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశతో కొన్నిరోజులపాటు తన కార్యకర్తలెవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారు లక్ష్మారెడ్డి. అయితే, జడ్చర్ల కార్యకర్తలందరూ పనుల కోసం మంత్రి శ్రీనివాస్‍ గౌడ్‍ దగ్గరకు వెళ్తుండటంతో కంగుతిన్న లక్ష్మారెడ్డి... మళ్ళీ నియోజకవర్గంపై దృష్టి సారించి అంతా చక్కదిద్దే పనిలో పడ్డారు. అలా, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నాగం, జూపల్లి, అరుణ, పి.చంద్రశేఖర్‍, లక్ష్మారెడ్డీలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు.