వారం రోజుల్లో బాబు బయటకి.. వైసీపీ పంతం నెగ్గినట్టే!!

 

వైసీపీ అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం అంటూ శంఖారావం మోగించింది. అందులో భాగంగా ఏకంగా 'ప్రజావేదిక' నే కూల్చి వేసింది. ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శలు కూడా ఎదుర్కొంది అది వేరే విషయం. ఆ కూల్చివేత ప్రజావేదిక తో ఆగిపోలేదు. పలువురు ప్రతిపక్ష టీడీపీ నేతలకు నోటీసులు వచ్చాయి. కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుకోవాలి. ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఇంటికి ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలనీ చెప్పారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఆ ఇల్లు అక్రమ నిర్మాణం, దాన్ని కూల్చివేయాల్సిందే అని చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నట్టుండి మళ్లీ తెరమీదకు వచ్చింది.

చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంటి గోడకు అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని రమేష్‌ పేరుతో సీఆర్డీఏ నోటీసులు అంటించింది. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులనూ ప్రస్తుత నోటీసులో సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన సీఆర్డీఏ నోటీసులకు ఇంటి యజమాని రమేష్ వివరణ ఇచ్చారు. అయితే రమేష్‌ వివరణ సంతృప్తికరంగా లేదని సీఆర్డీఏ నోటీసులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ లను నిర్మించారని తెలిపారు. కాగా, ఈ నోటీసుల వ్యవహారంపై లింగమనేని రమేష్ స్పందించారు. ఇంటి నిర్మాణ సమయానికి సీఆర్డీఏ లేదని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామని తెలిపారు. స్విమ్మింగ్‌పూల్‌కి రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఉందని రమేష్‌ వెల్లడించారు.

మరి ఈ నోటీసుపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు.. గతంలో రమేష్ వివరణతో సంతృప్తి చెందని అధికారులు.. ఈసారి మాత్రం సంతృప్తి చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు వారం రోజుల్లో ఇంటిని ఖాళీ చేయక తప్పేలా లేదు. అదే జరిగితే అధికార పార్టీ పంతం నెగ్గినట్టే. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ.. చంద్రబాబుని ఆ ఇంటి నుండి ఖాళీ చేయించాలని పట్టుదలతో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.