ఏకుగా వచ్చి మేకయిన రామచంద్రయ్య

దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య, ప్రజారాజ్యం పార్టీకి దగ్గరుండి తాళాలు వేయించిన తరువాత, ఆ పార్టీని కాంగ్రెస్ సముద్రంలో కలిపేసే వరకు చిరంజీవి వెనుక నిలబడి చక్రం తిప్పారు. ఆ తరువాత ఆయన చిరంజీవి చేయిపట్టుకొని కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టి ఆయనకి కేంద్ర మంత్రి పదవి, తనకి దేవాదాయశాఖ మంత్రి పదవి కూడా ఇప్పించుకొని వారు కలలు కన్న సామాజిక న్యాయం సాకారం చేసుకోగలిగారు.

 

తనకు మంత్రి పదవి దక్కితే అదే పదివేలనుకొన్న రామచంద్రయ్య మొదట్లో నిజంగా రాముడు మంచి బాలుడు లాగే వ్యవహరించేవారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో పైకి రావాలంటే సోనియా, రాహుల్, అంటూ భజన చేయడమో లేక కొంచెం నోరు పెట్టుకొని బ్రతకడమో తప్పనిసరి అనే విషయాన్ని కనిపెట్టిన ఆయన, వీ.హనుమంత రావు వంటి వారు సోనియా, రాహుల్, అంటూ భజన ఎంత కాలం భజన చేసినా వారి పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుందని గ్రహించి, ఆయన రెండో మార్గం ఎన్నుకొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగిపోతున్న రామచంద్రయ్య పనిలోపనిగా తమ అమాయకజీవిని కూడా తెగ పొగిడేస్తూ, అతని ముందు కిరణ్ కుమార్ ఎందుకు పనికిరాడని మీడియాని పిలిచి మరీ చాటింపు వేస్తుంటాడు. రాబోయే ఎన్నికలలో ఆ తరువాత కూడా చిరంజీవే ప్రధాన పాత్ర పోషించబోతున్నాడని ఇటీవలే జోస్యం కూడా చెప్పారు.

 

ఇక, నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీశైలంలో ఒక కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిసినప్పటికీ, ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా దేవాదాయ శాఖా మంత్రి అయిన తనను ముందుగా ఆహ్వానించలేదంటూ ముఖ్యమంత్రి కార్యక్రమానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొన్నారు. ఆయన ఈవిధంగా తనతో ఏదో వంకతో కయ్యానికి కాలు దువ్వుతుండటంతో ముఖ్యమంత్రి కూడా చాల అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తనతో మరీ సఖ్యతగా ఉండనప్పటికీ కనీస మర్యాదలు పాటిస్తాడు గనుక కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనతో ఎటువంటి సమస్యలు లేవు. అయితే ఆయన అనుచరుడయిన రామచంద్రయ్య మాత్రం చిరంజీవి కంటే ఎక్కువగా రెచ్చిపోవడం చూసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈసారి డిల్లీవెళ్ళినప్పుడు ఆయన పదవికి కత్తెర వేయాలని నిశ్చయించుకొన్నారు.

 

అయితే, రామచంద్రయ్యని కత్తిరించే ముందు తనకి పోటీగా తయారవుతున్న చిరంజీవిని కత్తిరించాలని భావించినందువల్లనేమో, కిరణ్ కుమార్ రెడ్డి కూడా పావులు కదిపారు. చిరంజీవికి చెందిన ఒక ఇంటి స్థలం పైలును, బ్లడ్ బ్లాంక్ స్థలం ఫైలును సిఐడి అదికారులు మొన్ననే స్వాదీనం చేసుకొన్నారు. గతంలో ఆయన తన ఇంటి పక్కన ఉన్న 900 గజాల స్థలాన్ని, అలాగే బ్లడ్ బ్యాంక్ స్థలం పక్కన గల రెండువందల గజాల స్థలాన్ని కూడా ఆక్రమించారని విజిలెన్స్ విభాగం వారు చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా ఇచ్చారు. అయితే, ఇంత కాలం ఆ విషయం పట్టించుకోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు హట్టాతుగా ఆ ఫైల్స్ అన్ని సిఐడి చేత వెలికిదీయించారు.

 

చిరంజీవి ఆక్రమించుకొన్న ఆ రెండు స్థలాలను తరువాత కాలంలో తన పేరిట రిజిస్టర్ కూడా చేయించుకొన్నట్లు సమాచారం. ఆయన అవినీతి భాగోతం ఈవిధంగా మీడియాకి లీక్ చేసి తన తడాఖా చూపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నించినట్లున్నారు. ఒకవేళ రామచంద్రయ్య తనను ఇబ్బందిపెడితే ఇటువంటి అస్త్రాలు ప్రయోగించడానికి కూడా వెనుకాడనని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టంగా తెలియజేసారు.