బందులో హింస.. పోలీసుల తీరుతో సీపీఐఎంఎల్ నేత బొటనవేలు తెగిపోయింది

 

తెలంగాణలో రెండు వారాలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు(అక్టోబర్ 19) బంద్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బంద్‌కి విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. మరోవైపు బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను మోహరించింది. కీలక నేతలను అరెస్ట్ చేయించింది. బంద్ నేపథ్యంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. చాలాచోట్ల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలాచోట్ల కార్మికులు ఆందోళనలు,నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్ద ఓ ఆర్టీసీ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడ బస్ డిపో వద్ద డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎంజీబీఎస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు అడ్డగించే అవకాశం ఉండటంతో తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్లు కూడా డిపోలకు రాలేదు.

మరోవైపు పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అరెస్ట్ ల పేరుతో కార్మికులు, నేతలపై దాడి చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరసనకు దిగిన సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావును అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులోకి ఎక్కించారు. ఈ క్రమంలో ఆయన బొటనవేలు తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. అయితే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తన బొటన వేలును తలుపుల మధ్య పెట్టి గట్టిగా నొక్కేశారని ఆరోపిస్తూ.. రంగారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ తనను చంపమన్నారా? అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడినందుకు ఇదేనా తనకిచ్చే బహుమానం అంటూ ప్రశ్నించారు. రంగారావు బొటనవేలు తెగిపోవడంతో వామపక్ష నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.