9 అడిగాం..5 ఇస్తారనుకున్నాం..3 ఇచ్చారు

 

కుడి ఎడమైతే పొరపాటు ఏముంది అంటారు.కానీ రాజకీయాల్లో ఒక సీటు అటూ ఇటూ అయినా జరిగే పరిణామాలు ఊహాకతీతం.ప్రస్తుతం అదే పరిస్థితి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన మహాకూటమిలో నెలకొంది.అధికార టీఆర్ఎస్ ని గద్దె దింపాలనుకొని పార్టీలు అయితే ఒక్కటయ్యాయిగాని ,ఒక్కటైన తర్వాత ఎదుర్కోవాల్సిన పరిణామాలను ఉహించలేదేమో అన్నట్లు ఉన్నాయి తాజా పరిణామాలు.టీఆర్ఎస్ పార్టీ జమానాలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే మహాకూటమిలో మాత్రం సీట్ల కోసం ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.తెగే కొద్దీ సాగుతుంది కాదా అని మరీ లాగితే తెగిపోద్ది అన్నట్లుంది ఇప్పుడు.ఎన్నిసార్లు సమావేశమై చర్చించినా ప్రతి సమావేశం సెమీపైనలే గాని ఫైనల్ గా మారటంలేదు.తాజాగా ఇదే అంశంపై చర్చించేందుకు కూటమిలోని సీపీఐ.. పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది.కాంగ్రెస్ పార్టీ కేటాయించిన స్థానాలపై చర్చ జరిగింది.తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టు మేము కనీసం 5  స్థానాలను అయినా ఇస్తారనుకుంటే చెప్పాపెట్టకుండా 3 స్థానాలు కేటాయించాం అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

సీపీఐ మొదట 9 స్థానాలను ఆశించింది. హుస్నాబాద్, కొత్తగూడెం, వైరా, మంచిర్యాల, మునుగోడు, దేవరకొండ, బెల్లంపల్లి, పినపాక, ఆలేరు స్థానాలు ఇవ్వాలని ప్రతిపాదించింది. సీపీఐ ప్రతిపాదనను కాంగ్రెస్ అంగీకరించలేకపోయింది. తొమ్మిది స్థానాలివ్వడం కష్టమని కాంగ్రెస్ చెబుతూ వస్తోంది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సీపీఐ కాస్త మెత్తపడింది. కనీసం ఐదు స్థానాలివ్వాలని కోరింది.ఐదింటిలో వైరా, హుస్నాబాద్‌, కొత్తగూడెం, మంచిర్యాల, బెల్లంపల్లి ఇవ్వాలని సీపీఐ పట్టుపడుతోంది. అయితే బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ 3 స్థానాలు కాంగ్రెస్ ఇస్తామంటోంది.దీనిపై పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు చాడ వెంకట్‌ రెడ్డి.

 

కార్యవర్గ అత్యవసర సమావేశానికి కాస్త విరామం ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ.. తమకు మూడు సీట్లు కేటాయించిన నేపథ్యంలో కూటమిలోని మిగిలిన పార్టీలతో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.తమతో ఎలాంటి చర్చలు జరపకుండానే కాంగ్రెస్‌ మూడు సీట్లు కేటాయించడాన్ని జీర్ణించుకులేకపోతున్నామన్నారు.ఇదే విషయాన్ని మిగిలిన పార్టీ నేతలను కలిసి చెప్పటం మంచిదని నిర్ణయించుకున్నామని, ఈ మేరకు తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డిని కలవాలనుకున్నట్లు తెలిపారు.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దుబాయిలో ఉండటం వల్ల జానాను కలుస్తున్నామన్నారు.వారిని కలిసి సీట్ల సర్దుబాటులో జరిగిన పరిణామాలపై చర్చిస్తామని చాడ చెప్పారు.వారితో చర్చల అనంతరం తిరిగి కార్యవర్గ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టంచేశారు.9 అడిగాం కనీసం 5 ఇస్తారనుకుంటే చెప్పాపెట్టకుండా 3 సీట్లు ఇస్తున్నట్టు ప్రకటించడం సరైన పంథా కాదేమో అని భావిస్తున్నామన్నారు.