కొడవళ్ళు మళ్ళీ కలిసాయి

 

నిన్న మొన్నటి వరకూ కత్తులు, కొడవళ్ళూ దూసిన లెఫ్ట్ పార్టీలు రెండూ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు ఎత్తులతో ముందుకు వెళుతున్నాయి. సిద్ధాంత రాద్ధాంతాలను పక్కనబెట్టి కలిసి సాగాలని నిర్ణయించుకుంటున్నారు పాత మిత్రులు. ఆ నాటి ఆ స్నేహం ఆనంద గీతం అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. జగన్ పార్టీతో ఎన్నికల్లో వెళదామని ఆలోచించిన సీపీఎం, అవినీతి మకిలి తమకూ అంటుకుంటుందని భయపడి దూరం జరిగారు. సీపీఐ కూడా రాజకీయ సర్దుబాటు కోసం అటు ఇటు దిక్కులు చూసింది. ఎటు వైపు నుంచీ గ్రీన్ లైట్స్ కనిపించకపోవడంతో, దూరంగా కనబడుతున్న రెడ్ లైటు వైపే సాగాగా సాగాగా అక్కడ తన పాత మిత్రుడు సీపీయం కనబడింది. అప్పుడు రాఘవా, నారాయణ అనుకొంటూ ఒకరినొకరుకరుచుకుపోయారు.

 

ఒకరికొకరు లాల్ సలాములు చేసుకొన్నాక, మనతో ఎవరూ కలవనప్పుడు మనమే ఒకరితో మరొకరు కలిసి పోటీ చేసుకొందామని ఇద్దరూ డిసైడ్ అయిపోయారు. కలిసి కలదు సుఖమూ అనే ఆ పాత మధురాలను ఒకసారి కలిసి పాడుకొన్నారు మన కామ్రేడ్లు. ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. కారణం అవినీతి కాంగ్రెస్ తో కలిసి వెళ్ళలేరు. మతతత్వ బీజేపీతో దోస్తీ కుదరదు. బాబు కూడా బీజేపీ వైపే చూస్తుండటంతో ఆయన కూడా తమతో పొత్తుల ఊసే ఎత్తక పోయే..తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకే గెటవుట్ చెప్పేసిన తెరాస తమను ఎర్రెర కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతుందని ఆశపడటం అత్యాశే అవుతుంది. అందుకే ఆడుకున్నా, పాడుకున్నా తమ బాష అర్ధం చేసుకోగల కామ్రేడ్స్ తో ముందుకు సాగడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చేసారు.

 

సీపీఎం, సీపీఐలకు ఇరు ప్రాంతాల్లో కలిసి వచ్చే అంశాలున్నాయి. ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన సీపీఐకి తెలంగాణలో ప్లస్ అయితే, సమైక్యాంధ్రకు కట్టుబడ్డ సీపీఎంకు సీమాంధ్ర లో పరిస్థితులు అనుకూలిస్తాయని అంచనా వేస్తున్నారు కామ్రేడ్స్. అంటే ఈ సారి కామ్రేడ్స్ కూడా మరో కొత్త శక్తిగా బరిలోకి దిగుతున్నారన్నమాట.