మంత్రి గారి కొత్త పాఠాలు.. ఆవు ఆక్సిజన్ విడుదల చేస్తుందట

 

మీరు స్కూల్ కి వెళ్ళారనుకోండి.. అ అమ్మ.. ఆ ఆవు.. ఇలాంటి పాఠాలు నేర్పుతారు. అదే అసెంబ్లీ వెళ్తే 'ఆవు ఆక్సిజన్ తీసుకోవడంతో పాటు తీసుకున్న ఆక్సిజన్‌నే మళ్లీ బయటకు విడుదల చేస్తుంది'.. ఇలాంటి కొత్త పాఠాలు నేర్చుకుంటారు. ఇంతకీ ఈ పాఠాలు చెప్పేది ఎవరో కాదు.. ఉత్తరాఖండ్ పశుసంవర్ధక శాఖ మంత్రి రేఖా ఆర్య. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో రేఖా ఆర్య మాట్లాడుతూ ఆవు ఆక్సిజన్ తీసుకోవడమే కాదు.. బయటకు విడుదల చేసేది కూడా ఆక్సిజనే అన్నారు. ఆమె పాఠాలు తోటి మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే విన్నారు కానీ.. జంతుశాస్త్ర నిపుణులు మాత్రం ఆమె మాటలను కొట్టిపారేస్తున్నారు. భూమిపై ఏ జీవి కూడా ఆక్సిజన్‌ను విడుదల చేయదు.. మొక్కలు, వృక్షాలు మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని వివరించారు. మంత్రిగారి మాటలు ఆసక్తికరంగా ఉండటంతో కొందరు జర్నలిస్టులు రేఖ ఆర్యను తను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఎలా కరెక్టవుతుందో చెప్పాలని అడిగారు. అందుకు మంత్రి గారు చాలా పద్దతిగా సమాధామిచ్చారు. 'ఆవు ఆక్సిజన్ తీసుకోవడమే కాదు.. ఆక్సిజన్‌ను విడుదల కూడా చేస్తుంది. ఆవు నుంచి స్వచ్ఛమైన పాలు వస్తాయి, నెయ్యి తయారవుతుంది. దీంతో ఆవులో ఎలాంటి చెడు ప్రక్రియ కానీ చెడు శక్తికానీ ఉండదు. ఈ లెక్క ప్రకారము కచ్చితంగా చెప్పగలను ఆవు ఆక్సిజన్‌ను మాత్రమే విడుదల చేస్తుంది' అని అన్నారు.. అయితే జంతుశాస్త్ర నిపుణులు మాత్రం ఆమె మాటలను ఖండిస్తున్నారు.