ఏపీలో పీఠముడిలా మండలి వ్యవహారం!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆకస్మికంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని  పేర్కొంటూ అసెంబ్లీ మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆయనకు లిఖిత పూర్వక సమాధానం పంపారు. మండలిలో ఇలాంటి పరిణామాలు జరగడం ఇదే తొలిసారిగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించినందుకు కార్యదర్శి సభాధిక్కారణ విచారణ ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మండలి చరిత్రలో ఈ పరిణామం కూడా మొదటిసారే కానుంది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని చైర్మన్ ఇచ్చిన ఆదేశాల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అదేవిదంగా రాష్ట్రంలో రెండు చట్ట సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండటం సంక్లిష్టతను పెంచింది. మామూలుగా శాసన సభ మండలికి వేరు వేరు కార్యదర్శులు ఉండాలి. కానీ ఇంతకు ముందు మండలి కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ పదవీ విరమణ తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులే మండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాసన సభలో వైసీపీకి మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండటం రెండు సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు వ్యవహారంలో తాము చెప్పినట్లే వినాలని అధికార పక్షం మండలిలో సంఖ్యాబలం ఉన్న తమ మాటే వినాలని విపక్ష టిడిపి పట్టుపడుతున్నాయి.

అలాగే.. మండలి కార్యదర్శి అధికార పక్షం చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఆదేశాలను వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి బులిటెన్ విడుదల చేయాలనీ రెండ్రోజుల క్రితం మండలి చైర్మన్ ఆయనకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో తన ఆదేశాలు పాటించాలని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ.. తాను ఆ ఆదేశాలను పాటించలేకపోతున్నానని కార్యదర్శి పంపిన సమాధానంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.  చైర్మన్ ఆదేశాలపై కొందరు సాంకేతిక అభ్యంతరాలు లేవనెత్తారని అందువల్ల తాను ఆ ఆదేశాలను పాటించలేక పోతున్నానని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పీటముడి పడింది. కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని చైర్మన్ ఆదేశిస్తుంటే దానిని అమలుచెయ్యటానికి కార్యదర్శి నిరాకరించటం ఏపీలో కొత్త ట్విస్ట్.