మరో షాక్.. వ్యాక్సిన్ రెండో డోసు తర్వాత కూడా పాజిటివ్

దేశం లో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 16,577 మందికి కొత్త‌గా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరోపక్క తెలంగాణాలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్న‌టివరకు రాష్ట్రంలో మొత్తం 200 లోపే కేసులు బ‌యవస్తుండగా .. గురువారం ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే 192 కొత్త కేసులు వెలుగు చూడ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

ఇది ఇలా ఉండగా గతంలో కరీంనగర్ ను వణికించిన కరోనా మరోసారి విజృంభిస్తోంది.తాజాగా జిల్లా వ్యాప్తంగా 26 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. రామగుండం ఎన్టీపీసీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ కు, గోదావరి ఖని బ్లడ్ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగికి, అతడి భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గోదావరి ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకడంతో వైద్యులు షాక్ కు గుర్యయారు. బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి వాసన కోల్పోవడంతో అనుమానం కలిగి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అతడు గత నెల 18న కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకోగా.. ఈనెల 18న రెండో డోస్ కూడా తీసుకున్నాడు. మరోపక్క బ్యాంక్ మేనేజర్‌కు కరోనా సోకడంతో అధికారులు బ్యాంక్‌ను మూసివేశారు. దీంతో కొద్దిరోజులుగా బ్యాంకుకు వెళ్లిన వినియోగదారులలో కూడా ఆందోళన నెలకొంది. మరోపక్క బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా కరోనా భయం పట్టుకుంది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.